ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వాలని పవన్ కల్యాణ్ ను అడిగారట..కానీ ఆయన స్పందించలేదట. ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పుకుని బాధపడుతున్నారు ఉత్తరాంధ్ర నుంచి ఓడిపోయిన ఎమ్మెల్సీ మాధవ్, అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం చెల్లని ఓట్ల స్థాయిలో కూడా పరపతి చూపించకపోవడంతో పరువు పోయిన అంశంపై పదాధికారుల సమావేశం పెట్టి మాట్లాడుకున్నారు. అందులో పవన్ కల్యాణ్ మద్దతివ్వకపోవడంపై ఎక్కువ ఫీలయ్యారు.
నిజంగా పవన్ మద్దతిచ్చి ఉంటే.. ఆ పొత్తుతో వచ్చే కొద్ది ఓట్లను కూడా తమ బలంగా చెప్పుకుని చెలరేగిపోయేవారు. కానీ పవన్ మద్దతిచ్చినా బీజేపీకి ఓట్లేసవారు తక్కువ. ఆ విషయం తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో తేలిపోయింది. ఆ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి బీజేపీకి వచ్చింది యాభై వేల ఓట్లు. పైగా పవన్ కూడా ప్రచారం చేశారు. ఆ ఓట్లన్నీ జనసేన, పవన్ ను చూసి వచ్చినవే. అయినా అదేదో తమ బలమని ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాతైనా సేనానికి కనీస గౌరవం ఇచ్చారా అంటే ఇవ్వలేదు.
పదో ఆవిర్భావ సభలో బీజేపీ ఎలా వ్యవహరించిందో.. రాష్ట్ర నేతలు ఏం చేశారో పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. వారంతా వైసీపీకో కుమ్మక్కయి రాజకీయాలు చేస్తున్నారన్న అభిప్రాయానికి అందరూ వచ్చారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ మద్దతివ్వకపోవడం వల్లే తమకు ఈ ఘోరఫలితాలు వచ్చాయన్నట్లుగా మాట్లాడుతున్నారు జనసేనతో కలిస్తే ప్రభంజనం సృష్టిస్తామని మాధవ్ చెప్పుకొచ్చారు.. అలాంటి ప్రభంజనం సృష్టిస్తే జనసేన సృష్టించాలి. ఎందుకంటే.. బీజేపీకి అసలు బలంలేదని తేలిపోయింది.
కొసమెరుపేమిటంటే.. గత ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా శ్రమించడంతో గెలిచిన మాధవ్ .. ఆ తర్వాత టీడీపీని ఎన్ని మాటలన్నారో.. తాము సొంత బలంతో గెలిచామని ఎలా చెప్పుకున్నారో అందరికీ గుర్తుండే ఉంటుంది. అదే దైర్యంతోనే ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు. ఇప్పుడు పవన్ మద్దతివ్వలేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.