తాజా సమాచారం ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లో నెలకొన్న కరువు పరిస్థితులపై తెదేపా మిత్రపక్షం భాజపా కూడా కరువు పరిస్థితుల అందోళనలకి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. మొన్న ఆదివారం రాత్రి కడపలో రాయలసీమ జిల్లాల భాజపా నేతలు అందరూ ఒక భాజపా నేత ఇంట్లో రహస్యంగా సమావేశమయినట్లు తెలుస్తోంది. వారి సమావేశంలో ప్రధానంగా తెదేపాతో తమ సంబంధాల గురించే చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా తెదేపా నేతలు, మంత్రులు అందరూ కూడా రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తమకు సహకరించడం లేదన్నట్లు మాట్లాడటంపై సమావేశంలో పాల్గొన్న భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కేంద్రం ఇస్తున్న నిధులు గురించి చెప్పకుండా, ఇవ్వని వాటి గురించే ఎక్కువగా మాట్లాడుతూ, ప్రజల దృష్టిలో పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని వారు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కనుక ఇకపై తాము కూడా తెదేపా ప్రభుత్వాన్ని నిలదీయడం మంచిదని, ముందుగా కరువు సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే వారి సమావేశం గురించి భాజపా నేతలు ఇంకా గోప్యత పాటిస్తున్నారు. బహుశః అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారేమో? ఒకవేళ వారికి అనుమతి లభిస్తే తెదేపాతో తెగతెంపులకి భాజపా కూడా సిద్దం అయిపోయినట్లే భావించవచ్చు.