ఆంధ్రప్రదేశ్ బీజేపీ ముఖ్య నేతలు దాదాపుగా 30 మంది ఢిల్లీలో ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మురళీధరన్‌తో సమావేశం అయ్యారు. పార్టీలో పరిస్థితులు.. సోము వీర్రాజు, జీవీఎల్ చేస్తున్న నిర్వాకాలపై పూర్తి స్థాయి నివేదిక అందించారు. తక్షణం సోము వీర్రాజను తప్పించాలని.. జీవీఎల్‌ను ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా చూడాలని వారు మురళీధరన్‌కు తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేతలంతా కొద్ది రోజుల కిందటే విజయవాడలో సమావేశం అవ్వాలనుకున్నారు. కానీ అలా సమావేశం అయితే మొదటికే మోసం వస్తుందని.. కావాలంటే అందరూ ఢిల్లీకి వచ్చి చెప్పుకోవాలని హైకమాండ్ సమాచారం పంపింది.
హైకమాండ్ సూచనలతో ఢిల్లీకి వెళ్లిన ఏపీ బీజేపీ ముఖ్య నేతలు.. తాము చెప్పాలనుకున్నదంతా చెప్పారు. ఇప్పటికే పలువురు నేతలు బీజేపీని వదిలి టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. కన్నా లక్ష్మినారాయణ పార్టీలో చేరిపోయారు. ఆయన వర్గం అంతా టీడీపీలోకి వెళ్లడం ఖాయమే. ఇక ఆయనతో సంబంధం లేకుండా.. బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై అసహనంతో.. వచ్చేది టీడీపీనేనన్న నమ్మకంతో మరికొంత మంది తెలుగుదేశం వైపు చూస్తున్నారు. కొంత మంది నేతలు ఇప్పటికే చర్చలు జరిపారని కూడా చెబుతున్నారు.
పార్టీలో ఇప్పుడు సోము వీర్రాజు.. జీవీఎల్ నరసింహారావు తప్పితే ఎవరూ తెర మీద కనిపించడం లేదు. వారిద్దరూ వైసీపీ కోవర్టులుగా బీజేపీని మరింతగా దిగజారుస్తున్నారని క్యాడర్ మొదటి నుంచి ఆందోళనలో ఉంది. ఇప్పుడు హైకమాండ్ ఏపీ బీజేపీ నేతలకు ఎలాంటి అభయం ఇచ్చి పంపిస్తుందనేది కీలకం. పట్టించుకోకపోతే.. ఏపీ బీజేపీలోచాలా మంది టీడీపీలోచేరిపోయే అవకాశాలు ఉన్నాయి.