స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఏపీలో రాజకీయ అలజడి రేగడం ఖాయంగా కనిపిస్తోంది. కరోనాకు ముందు స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఏపీ సర్కార్ ఎన్నికల నిర్వహణపై ఎలాంటి అభిప్రాయాలతో ఉన్నాయో.. ఇప్పుడు అందకు పరస్పర విరుద్ధ అభిప్రాయాలతో వ్యవహరిస్తున్నాయి. ఎన్నికల సంఘం అప్పట్లో ఎన్నికలు వద్దన్నది..ఇప్పుడు పెడతామంటోంది. అప్పట్లో ప్రభుత్వం పెట్టాలన్నది.. ఇప్పుడు వద్దంటోన్నది. ఎన్నికల సంఘం రాజకీయ పార్టీ అభిప్రాయాలు తెలుసుకునేందుకు బుధవారం సమావేశం కూడా నిర్వహిస్తోంది. ఈ తరుణంలో అసలు భారతీయ జనతా పార్టీ విధానం ఏమిటన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పటికే… ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదని చెబుతున్నారు. కోర్టులో పిటిషన్ కూడా వేశారు. టీడీపీ ఎన్నికలు నిర్వహించాలని అంటోంది కానీ.. ఎన్నికల ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి నిర్వహించాలని అంటోంది. ఇతర విపక్షాలదికూడా అదే మాట. అయితే… అధికారపక్షానికి మాత్రం.. ఎన్నికల కమిషనర్‌గా తమ మాట వినేవారు ఉన్న తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలనుకుంటోంది. అందులో మారో మాట లేదు. ప్రభుత్వం ఈ అభిప్రాయంతో ఉన్న సమయంలో.. నిమ్మగడ్డ ఎన్నికల నిర్వహణకు ముందుకెళ్తే… సహకరించడం కష్టమవుతుంది. అలా సహకరించకపోతే రాజ్యాంగసంక్షోభం ఏర్పడుతుంది .. అది వేరే విషయం.
అయితే.. కేంద్రంలో అధికారంలో ఉన్నపార్టీగా బీజేపీకి కొంత బాధ్యత ఉంది. ఎన్నికల విషయంలో ఓ స్పష్టమైనఅభిప్రాయం వెల్లడించాల్సి ఉంది. వాయిదా పడిన సమయంలో.. బీజేపీ నేతలపై కూడా.. వైసీపీ నేతలు దాడులు చేశారు. అప్పట్లో చాలా రచ్చ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం.. ఆ ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలన్న వాయిస్‌ను బలంగా వినిపించలేకపోతున్నారు. బహుశా… వైసీపీ విధానమే.. తమ విధానమని.. రేపో మాపో… విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలు హింట్ ఇచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదన్న చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది.