ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉనికిచాటుకునేందుకు ఇప్పుడు హడావుడిగా ప్రయత్నిస్తోంది. ప్రజాపోరు సభలతో స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు పెట్టుకుని గట్టిగానే బలపడేందుకు ప్రయత్నిస్తోంది. ప్రతి ఊరిలో ముఖ్య కూడలిలో ఓ సభ ఏర్పాటు చేస్తోంది. ఆ సభలకు వీలైనంత ప్రముఖ నేతలను ఆహ్వానిస్తున్నారు. కొన్నికొన్ని చోట్ల కేంద్ర మంత్రులుకూడా వచ్చేలా చూసుకుంటున్నారు. వీటిని నాలుగు రోజులుగా నిర్వహిస్తున్నారు. రోజులుకు మూడు నుంచి నాలుగు వందల చోట్ల నిర్వహిస్తున్నారు.
బీజేపీకి క్యాడర్ కాస్త తక్కువే. వారిలోనూ చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు తక్కువ. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. వాటిని ప్రస్తుతం బీజేపీ పరిష్కరించుకుని క్యాడర్ను యాక్టివేట్ చేసుకుంది. ఆ పార్టీలో ఇటీవలి కాలంలో మౌలికమైన మార్పు వచ్చింది. గతంలో వైసీపీకి మద్దతుగా మాట్లాడి టీడీపీని తిట్టడమే పనిగా పెట్టుకునేవారు. ఇప్పుడు టీడీపీ విషయంలోపాజిటివ్ గా మాట్లాడుతూ వైసీపీపై మండి పడుతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా పెరిగిందని .. దాన్ని ఓట్లుగా మల్చుకునేందుకు ఈ టర్న్ తీసుకున్నారనుకోవచ్చు.
చురుగ్గా ఉండే యువ నేతలకు ఇటీవలి కాలంలో ఎక్కువగా బాధ్యతలిస్తున్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి లాంటి నేతలు రాష్ట్రమంతా తిరుగుతున్నారు. మొత్తంగా బీజేపీ గ్రాస్రూట్లో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే బీజేపీ ఎదగడానికి ఇది ఎంత మాత్రం సరిపోదని.. బీజేపీ హైకమాండ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్న వాదన కూడా ఆ పార్టీ నేతల్లో ఉంది.