ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాజపా అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న కంబంపాటి హరిబాబు పదవీ కాలం ముగిసి రెండు నెలలపైనే అయ్యింది. కానీ ఇంతవరకు ఆయన స్థానంలో ఎవరిని నియమించాలో తెలియక భాజపా అధిష్టానం తికమకపడుతున్న కారణంగా నేటికీ ఆయనే అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. రాష్ట్ర భాజపాలోని తెదేపాకి అనుకూల, వ్యతిరేక వర్గాలు ఎవరి వాదన వాళ్ళు గట్టిగా వినిపిస్తుండటం, అదే సమయంలో తెదేపాతో సంబంధాలు ఒక్కోరోజు ఒక్కోలాగ మారుతుండటం చేత, రాష్ట్రంలో పార్టీకి ఎవరిని అధ్యక్షుడుగా నియమిస్తే మంచిదో తేల్చుకోలేకపోతోంది. సోము వీర్రాజుని అధ్యక్షుడుగా నియమించాలని పార్టీలో ఒక వర్గం గట్టిగా పట్టుబడుతోంది. కానీ ఆయన తెదేపాని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు కనుక ఆయనకి బాధ్యత అప్పగిస్తే తెదేపాతో తమ సంబంధాలు దెబ్బ తినడమే కాకుండా రాష్ట్ర భాజపా నిలువునా చీలిపోయే ప్రమాదం ఉందని భాజపా అధిష్టానం వెనుకంజ వేస్తోంది.
సరిగ్గా ఈ సమయంలో రాయలసీమకి చెందిన చల్లపల్లి నరసింహ రెడ్డి పేరు పరిశీలనకి వచ్చింది. ఆయన భాజపాలో చాలా సీనియర్ నేత. వివాదాలకి దూరంగా ఉంటారనే మంచిపేరుంది. ప్రస్తుతం భాజపా జాతీయ కిసాన్ మోర్చాకి జాతీయ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. రాయలసీమలో బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆయనని రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించినట్లయితే, ఆ ప్రాంతంలో ఆ వర్గం ప్రజలని, నేతలని భాజపా వైపు ఆకర్షించవచ్చని, తెదేపాకి కూడా ఆయన ఆమోదయోగ్యుడని ఆయన మద్దతుదారులు వాదిస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకొని పోవడంతో, రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలు అయిష్టంగానే వైకాపావైపు మొగ్గవలసి వస్తోందని, అటువంటి వారిని భాజపా వైపు ఆకర్షించడానికి చల్లపల్లి నరసింహ రెడ్డిని అధ్యక్షుడుగా నియమించడం చాలా మంచిదని వాదిస్తున్నారు.
వచ్చే ఎన్నికలలో తెదేపాతో కలిసి కొనసాగుతామో లేదో తెలియని పరిస్థితులున్నప్పుడు, దానిని గట్టిగా ఎదుర్కొని రాష్ట్రంలో భాజపాని బలోపేతం చేసుకొని గెలిపించుకోగల సోము వీర్రాజునే అధ్యక్షుడుగా నియమించడమే పార్టీకి మేలు చేస్తుందని మరో వర్గం వాదిస్తోంది. వారిరువురిలో ఎవరో ఒకరిని త్వరలోనే రాష్ట్ర భాజపా అధ్యక్షుడుగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.