ఆంధ్రప్రదేశ్ అంటే ప్రధాని మోడీకి విదేశంలా కనిపిస్తోందో ఏమో..! ఇదే ధోరణిలో రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఉన్నట్టున్నారు. ఢిల్లీ వెళ్లి మోడీని కలిశారు కన్నా. ఆ తరువాత, విలేకరులతో మాట్లాడుతూ… రాష్ట్రానికి రమ్మని మోడీని ఆహ్వానించాననీ, ఆయన పరిశీలిస్తానని చెప్పారని గొప్పగా అన్నారు! తప్పక రావాల్సిందిగా తాను ఒత్తిడి చేశానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భాజపాని మోసం చేశారని మోడీ చెప్పారన్నారు. రాష్ట్రానికి సంబంధించి, పెండింగ్ లో ఉన్న 12 అంశాలను వెంటనే అమలు చేయాలని వినతి పత్రం సమర్పించినట్టు కన్నా చెప్పారు. ఈ సందర్భంలో మోడీ స్పందించి… ఏపీకి ఇచ్చిన హామీల్లో 85 శాతం పూర్తి చేశామనీ, మిగతా 15 శాతం కూడా నెరవేర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని మోడీ చెప్పారని, కన్నా చెప్పారు.
ఆ 12 అంశాలు ఏంటంటే.. విశాఖ రైల్వే జోన్, దుగరాజపట్నాకి ప్రత్యామ్నాయంగా రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, గిరిజన విశ్వవిద్యాలయం, పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విజయవాడ వైజాగ్ మెట్రో ప్రాజెక్టులు, విద్యాసంస్థలకు నిధులు, జిల్లాకి రూ. 150 కోట్లు చొప్పున వెనకబడిన ప్రాంతాలకు సాయం, వెనకబడ్డ ఏడు జిల్లాలకు జీఎస్టీ రాయితీ, రాయలసీమలో స్పెషల్ ఇండస్ట్రియల్ కారిడార్, స్టార్టప్స్ కి ప్రోత్సాహక నిధులు, గిరిజనులూ మత్స్యకారుల అభివృద్ధికి మరిన్ని నిధులు..! వీటిపై కన్నా సాయం కోరగా, స్పందిస్తామని మోడీ హామీ ఇచ్చారట.
అంటే, ఏపీకి చాలా ఇచ్చేశామని ఇన్నాళ్లూ ప్రచారం చేసుకుంటున్న ఆ 85 శాతంలో ఇవేవీ లేవని భాజపా స్వయంగా ఒప్పుకుంటోంది! ఆ లెక్కన కేంద్రం ఇచ్చిన హామీల్లో 85 శాతం పూర్తయినవి ఏవి..? వాటి జాబితా కూడా ఈ సందర్భంగా కన్నా విడుదల చేస్తే బాగుంటుంది. రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన 18 అంశాలపైనే టీడీపీ సర్కారు మోడీ సర్కారును డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో ఉన్నవే కదా ఇవన్నీ..? హోదాతో సహా వీటన్నింటిపై స్పందించాలనే కదా.. బడ్జెట్ సమావేశాల దగ్గర్నుంచీ మొత్తుకుంటూ ఉన్నది. అన్నీ ఇచ్చేశాం ఇచ్చేశాం అని అంటూ భాజపా చెబుతూ వచ్చింది. కేంద్ర సాయంపై హరిబాబు ఏకంగా పుస్తకమే రాసేశారు!
85 శాతం పూర్తి చేశామని చాటింపేసిన తరువాత, ఇవాళ్ల 12 అంశాలపై కన్నా వినతి పత్రం ఇవ్వడంలో ఆంతర్యం ఇప్పటికైనా ఏపీ భాజపా నేతలకు అర్థం కావడం లేదా..? ఏపీకి ఇచ్చిన హామీల్లో కేంద్రం నెరవేర్చినవి విద్యా సంస్థలకు అరకొర నిధులు, రాజధాని నిర్మాణానికి నామ్ కే వాస్తే కేటాయింపులు, పోలవరంపై మోకాలడ్డుతూ విదుల్చుతున్న సాయం..! ఇప్పుడు కన్నా ఇచ్చిన వినతి పత్రంలో ఉన్నవన్నీ ఏపీ సర్కారు డిమాండ్లలో ప్రధానమైనవే కదా! మోడీకి ఈ వినతి ఇవ్వడం ద్వారా.. వీటిల్లో ఏ ఒక్కటీ కేంద్రం ఇవ్వలేదని రాష్ట్ర భాజపా అధ్యక్షుడే చెబుతున్నట్టుగా లేదూ! ఆ 85 శాతం సాయం ప్రచారంలో డొల్లతనం వారే బయటపెట్టుకున్నట్టుగా ఉంది.