ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని సోము వీర్రాజు ప్రకటించారు. బీజేపీ -జనసేన పొత్తు పెట్టుకున్న కొత్తలో అధికారంలోకి వస్తే పవన్ కల్యాణే ముఖ్యమంత్రి అన్నట్లుగా సోము వీర్రాజు ప్రకటనలు చేశారు. ఆ తర్వాత చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారన్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారు. కానీ.. ఇటీవలి కాలంలో సోము వీర్రాజునే ముఖ్యమంత్రి అవుతారని బీజేపీ సోషల్ మీడియా టీం పేజీలు క్రియేట్ చేసింది. సోమువీర్రాజు ఫర్ సీఎం పేరుతో కొన్ని సర్క్యూలేట్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో సోము వీర్రాజు హఠాత్తుగా బీజేపీ అధికారంలోకి వస్తే.. బీసీ అభ్యర్థినే సీఎం చేస్తామని ప్రకటించేశారు.
బహుశా.. తనను లేదా పవన్ కల్యాణ్‌ను ఆయన బీసీగా భావిస్తున్నారేమోనన్న చర్చ ఇప్పుడు ప్రారంభమయింది. అయితే ఏ వర్గం ఓటు బ్యాంక్ లేక.. చిక్కి శల్యమైపోతున్న బీజేపీకి బీసీ వర్గాల ఓటు బ్యాంక్ ను ఆకట్టుకోవడం కోసం ఇలాంటి ప్రకటన చేశారన్న చర్చ కూడా జరుగుతోంది. సోము వీర్రాజు ప్రకటనపై వైసీపీ, టీడీపీ నేతలు స్పందించారు. వైసీపీ ఎలక్షన్ జిమ్మిక్ అని చెబుతూండగా.. టీడీపీ మాత్రం… ముందు సోము వీర్రాజు తన పదవికి రాజీనామా చేసి.. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని బీసీకి ఇవ్వాలని సూచించింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు బీసీగా ఉన్నారని చెప్పుకొచ్చారు.
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలను కేంద్రం కల్పించకపోగా… ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును కూడా పూర్తి స్థాయిలో అమ్మేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో చర్చ జరుగుతున్న సమయంలో… సోము వీర్రాజు బీసీ కార్డు ప్రయోగిస్తున్నారు. రాష్ట్రానికి ఏమీ చేయకపోయినా.. తమ పార్టీలోకి నేతలు వచ్చేందుకు పరుగులు పెడుతున్నారని సోము చెప్పుకుంటున్నారు. మొత్తానికి సోము ప్రకటన .. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ను ఇబ్బంది పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.