నువ్వే..నువ్వే సినిమాలో పోలీస్ పాత్రలో ఎంఎస్ నారాయణ.. ఏయ్ అని అరుస్తాడు. ఆ అరుపుకు బైక్ మీద వెళ్లే సునీల్ ఆగి.. నువ్ అరిచావని ఆగలేదు.. అలా అరిస్తే ఎవరూ ఆగరు అని చెప్పడానికి ఆగానని చెప్పి చక్కా వెళ్లిపోతాడు. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పరిస్థితి కూడా అంతే ఉంది. ఆయన ఏపీ ప్రభుత్వంపై పదే పదే అరుస్తున్నారు. కేంద్ర పథకాలకు జగన్ స్టిక్కర్లు వేసుకుంటున్నారని.. అంటున్నారు. ప్రెస్ మీట్ పెట్టిన ప్రతీ సారి సోము వీర్రాజు ఈ మాటలు చెబుతారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలన్నీ కేంద్ర నిధులేనని చెబుతూంటారు. తాజాగా కేంద్రం పేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేయమని ఇస్తే..దానిపైనా స్టిక్కర్లేసుకున్నారని సోము వీర్రాజు బహిరంగలేఖ రాశారు.
అంటే నేరుగా కూడా రాయలేదన్నమాట. ఎన్ని సార్లు ఇలా ప్రెస్ మీట్లు పెట్టి అరిచినా… కేంద్ర మంత్రులు వచ్చి గోల చేసినా.. ఆ పేర్లు మార్చరు.. వీరు అరవడం మానరు. అసలు వైసీపీ నేతలు పట్టించుకోరు కూడా. కనీసం ఇలా అరిస్తే.. ఎవరూ మార్చరు గురూ అని చెప్పడానికి కూడా వైసీపీ నేతలకు తీరిక ఉండదు. అసలు కేంద్రం ఇచ్చే నిధులపై … తమ ముద్ర ఉండాలని కేంద్రం అనుకుంటే దానికి తగ్గట్లుగా ఢిల్లీ నుంచి చర్యలు ఉండేవి . అలాంటి ఇంట్రెస్ట్ పైన లేదు కాబట్టి ఇక్కడ జగన్ రెడ్డి సర్కార్ ఆడిందే ఆట పాడిందే పాట అవుతుంది.
కానీ సోము వీర్రాజు మాత్రం తాము వైసీపీ సర్కార్ పై అంతులేని కథలా పోరాడుతున్నామని చెప్పుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రెస్ మీట్లు.. ప్రెస్ నోట్లు విడుదల చేస్తున్నారు. కానీ వాటి వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని మాత్రం ఆయనకు అర్థం కావడం లేదని బీజేపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.