అనుమతి ఇవ్వకపోతే బీజేపీ విశ్వరూపం చూస్తారని రథయాత్ర గురించి భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నేతలు… రథయాత్రను ఇప్పుడు వాయిదా వేసుకున్నారు. పంచాయతీ ఎన్నికలు దూసుకు రావడంతో.. జనసేనతో కలిసి అన్ని చోట్లా పోటీ చేయాలన్న లక్ష్యంతో రథయాత్రను తాత్కాలికంగా ఆపేస్తున్నట్లుగా సోము వీర్రాజు ప్రకటించారు. ఆలయాలపై దాడులకు నిరసనగా.. ఫిబ్రవరి నాలుగో తేదీ నుంచి ఎనిమిది రోజుల పాటు.. కపిల తీర్థం నుంచి రామతీర్థం వరకు యాత్ర చేయాలని బీజేపీ నేతలు సంకల్పించారు. దీనికోసం ఏర్పాట్లు కూడా ప్రారంభించారు.
అయితే అనూహ్యంగా పంచాయతీ ఎన్నికలు ఖరారు కావడంతో ఇప్పుడు… దానికే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు.. పార్టీ నేతలు.. నిర్ణయం తీసుకుని హైకమాండ్‌కు తెలిపారు. హైకమండ్ కూడా అంగీకరించడంతో రథయాత్ర వాయిదా పడింది. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఆగిపోయిన మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ఉపఎన్నికలు జరుగుతాయి. ఇదయ్యే సరికి మార్చి అయిపోతుంది. ఆ తర్వాతే రథయాత్ర గురించి ఆలోచించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
అయితే అప్పటికే ఆలయాలపై దాడుల అంశం పాతబడిపోతుందా.. రథయాత్ర చేస్తే.. అంత పబ్లిసిటీ వస్తుందా అన్నదాన్ని బేరీజు వేసుకుని తదుపరి కార్యాచరణ ఖరారు చేసుకునే అవకాశం ఉంది. జనసేనతో విస్తృత సంప్రదింపులు జరుపుతున్న బీజేపీ నేతలు పంచాయతీల్లోనూ కలిసి పోటీ చేయాలని భావిస్తున్నారు. చాలా గ్రామాల్లో రెండు పార్టీలకు పెద్దగా క్యాడర్ నిర్మాణం లేకపోవడంతో.. వీలైనన్ని ఎక్కువ చోట్ల పోటీ చేయాలనుకుంటున్నారు.