దేశవ్యాప్తంగా ఉండే రాజకీయాలు వేరు – ఏపీలో ఉండే రాజకీయాలు వేరు. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు గుర్తించలేకపోతున్నారు. గుర్తించినా వివిధ కారణాలతో తమ స్ట్రాటజీల్నీ మార్చుకకోలేకపోతున్నారు. తాజాగా కడపకు వెళ్లి బీజేపీ ఆఫీసుకు శంకుస్థాపన చేసిన బీజేపీ నేతలు .. తమ ప్రసంగాల్లో మత గొడవలను హైలెట్ చేసేందుకే ప్రయత్నించారు. ఇటీవల శ్రీశైలంలో జరిగిన గొడవలను హైలెట్ చేసి.. హిందువులపై దాడులన్నట్లుగా చెప్పేందుకు ప్రయత్నించారు.
కులాల ప్రభావం ఎక్కువగా ఉన్న చోట మత రాజకీయాలు వర్కవుట్ కావు. ప్రస్తుతం ఏపీలో కుల రాజకీయాలే నడుస్తున్నాయి. అందుకే బీజేపీ మతం పేరుతో చేస్తున్న ప్రయత్నాలు వర్కవుట్ కావడం లేదు. అడపాదడపా వివాదాలు రేకెత్తించినా ప్రయోజనం ఉండటం లేదు. ప్రజల్లో ఎమోషన్ రావడం లేదు. దీన్ని గుర్తించాల్సిన నేతలు… పట్టించుకోవడం లేదు. తమ పద్దతిలో తాము వెళ్తున్నారు. దీంతో వారు ప్రజల కోసం రాజకీం చేయడం లేదని.. తమ కోసం తాము చేసుకుంటున్నారన్న అభిప్రాయం బలపడుతోంది.
ఏపీ వ్యవహారాలను చూసుకునే సునీల్ ధియోధర్ సోషల్ మీడియా అకౌంట్లు చూస్తే మతం తప్ప మరొకటి కనిపించదు. జగన్ విషయంలో సాఫ్ట్ గా ఉండే ఆయన… సోము వీర్రాజు ప్రభుత్వాన్ని సుతిమెత్తగా విమర్శిస్తూ ఉంటారు. దీంతో ఆ పార్టీకి ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా వ్చే అవకాశం సన్నగిల్లిపోతోంది. పార్టీ పరిస్థితిని మెరుగుపర్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవన్నీ అసలు లక్ష్యం దిశగా కాకుండా.. సొంత నేతల లక్ష్యం దిశగా ఉండటంతోనే ఆ పార్టీ ఎదగడం లేదు.
టీడీపీతో పొత్తు వల్ల ఎదగలేకపోతున్నామని తెగ బాధపడిపోయిన నేతలు పొత్తు లేకపోయినా ఏం చేశారో వారికే తెలియాలి. ఐదేళ్లలో పార్టీని ఎంత మేర బలపరిచారో వాళ్లకే తెలియాలి.