తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం 21న జరగబోతోంది. దానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అనేక చర్చలు జరుగుతున్నాయి. గతంలో.. జగన్మోహన్ రెడ్డి.. ఆ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా చేసిన జల దీక్ష దగ్గర్నుంచి… ఆ ప్రాజెక్ట్ పూర్తయితే..దిగువకు నీళ్లు రావనేవరకూ… ప్రతీ అంశం.. హాట్ టాపిక్ అవుతోంది. అయితే.. జగన్మోహన్ రెడ్డి.. నిన్నామొన్ననే.. అదీ కూడా.. తిరుగులేని విధంగా 151 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి… దీనిపై ప్రశ్నించడానికి పెద్దగా ఎవరూ సిద్ధపడటం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం.. తొలి సారి నోరు విప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయితే.. ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నికర జలాలపై ప్రభావం పడుతుందని.. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ .. ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి.. దీనిపై స్పష్టత తీసుకోవాలన్నారు. వాటిపై ప్రజలకు వివరణ ఇచ్చిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి ఆ ప్రారంభోత్సవానికి వెళ్ళాలని మాధవ్ డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా.. చాలా మంది సామాన్య ప్రజల అనుమానాలు కూడా ఇలానే ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు నీటి కేటాయింపుల్లేవని ఏపీ వాదిస్తోంది. ఈ మేరకు కేంద్రం వద్ద ఫిర్యాదులు చేసింది. కానీ స్పందన లేదు. కేటాయింపుల్లేకుండా… 200 టీఎంసీలను వాడుకునేందుకు ప్రాజెక్ట్ నిర్మించడంతో… ఆ ప్రభావం దిగువరాష్ట్రం ఏపీపై తీవ్రంగా ఉంటుందనే ఆందోళన ఉంది. అదే విషయాన్ని బీజేపీ నేతలు కూడా.. వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వెళ్లే ముందు… నికరజలాలపై స్పష్టతను ప్రజలకు ఇవ్వాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. ఇలా ఇవ్వడం జగన్మోహన్ రెడ్డికి కూడా.. మంచిదే. రేపు.. కాళేశ్వరం నుంచి గోదావరి నీటిని వచ్చిన నీటిని వచ్చినట్లుగా ఎత్తి పోస్తే..ఏపీలో గోదావరి పరిస్థితి కృష్ణానదిలాగే అయిపోయే అవకాశం ఉంది. వైసీపీతో అప్రకటిత మిత్రపక్షంలా ఉన్నప్పటికీ… బీజేపీ నేతలు…కనీసం అనుమానాన్ని వ్యక్తం చేసి.. జగన్‌ను సమాధానం అడగటం… మారుతున్న రాజకీయానికి నాంది అనుకోవాలేమో..?