హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీలమధ్య అంతరం క్రమక్రమంగా పెరిగిపోతోంది. బీజేపీ నేతలు కన్నా, కావూరి, సోము వీర్రాజు ఇవాళ మిత్రపక్షం తెలుగుదేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో మీడియాలో మాట్లాడుతూ, రాష్ట్రంలో లంచగొండితనం గతంలోకన్నా పెరిగిందని కావూరి అన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం బలహీనపడుతోందని, ఈ క్రమంలో బీజేపీ ప్రాధాన్యత బాగా పెరిగిందని చెప్పారు. బాగా వెనకబడి ఉన్న రాయలసీమకు వేలకోట్ల ప్యాకేజ్ కావాల్సి ఉందని, ఆ విషయాన్ని ప్రధాని దృష్టికికూడా తీసుకెళ్ళబోతున్నామని చెప్పారు. ఏపీలో భవిష్యత్తు బీజేపీదేనని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ సమూలంగా తుడిచిపెట్టుకు పోయిందని చెప్పారు. రెండో పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏపీలో ఏమాత్రం పెరగటంలేదని, కాస్తో కూస్తో తగ్గుతోందని అన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా పొలిటికల్ వేక్యూమ్ ఏర్పడిందని అన్నారు. దీనిని పూరించగల అవకాశాలు నైతికంగాగానీ, రాజకీయపరంగా కానీ, సిద్ధాంతపరంగా కానీ బీజేపీకే అన్నారు. పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని, పోలవరం ప్రాజెక్ట్ను త్వరగా పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు మరో సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, రంగా హత్యపై జోగయ్య వెల్లడించిన విషయాలపై విచారణ జరిపించుకుని చంద్రబాబునాయుడు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని అన్నారు. సోము వీర్రాజు మాట్లాడుతూ, ప్రత్యేక హోదా ఇవ్వటానికి కొన్ని ఆటంకాలున్నాయని, మిగతా రాష్ట్రాలు గొడవచేస్తాయని చెప్పారు. మిత్రపక్షమైన బీజేపీ నేతలు చంద్రబాబుపై, ప్రభుత్వ పనితీరుపై ఇలా వ్యాఖ్యానించి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టినట్లు కనబడుతోంది. ఇవాళ్టి పరిణామంతో ఇరుపార్టీల మధ్య సంబంధాలు మరింత దిగజారినట్లయింది.