ఆదివారం కేంద్ర జలశక్తి మంత్రిని ఏపీ బీజేపీ బృందం కలవనుంది. శుక్రవారం వారు ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఓ నివేదిక తయారు చేశారు. దాన్ని మంత్రికి అందించనున్నారు. నవంబర్ మొదటి వారం నుంచి మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రాజెక్టు పనులు చేపడుతుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అందుకు అనుగుణమైన ఏర్పాట్లు అక్కడ ఏమీ జరగడం లేదని బీజేపీ నిర్ణయానికి వచ్చింది. నవయుగ ఇప్పటికే మెషినరీ మొత్తాన్ని తరలించేసింది. మేఘాకు ఇంకా కాంట్రాక్టు ఖరారు కాలేదు. ఇరవై రోజుల్లో మిషనరీని ప్రాజెక్ట్ సైట్‌కి తెప్పించడం అసాధ్యమని బీజేపీ నేతలు చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ లు కాంట్రాక్టర్ ను మార్చడం వల్ల సమన్వయ లోపంతో పాటు, న్యాయపరమైన చిక్కులు, ఆర్ధిక భారం, జాప్యం జరుగుతుందని చెబుతూ వచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రాజెక్టు నిర్మాణ పనులు నాలుగు నెలల నుంచి పూర్తిగా నిలిచిపోవడం, న్యాయపరమైన చిక్కులను అధిగమించి, ప్రాజెక్టు నిర్మాణ పనులును చేపట్టేందుకు మరో రెండు నెలల సమయం పడుతుందని బీజేపీ బృందం అంచనాకు వచ్చింది. ఇదే అంశాన్ని కేంద్ర జలవనరులశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. 13వ తేదీ సాయంత్రం ప్రతినిధి బృందం కేంద్ర జలవనరులశాఖను కలిసి తమ నివేదికను ఇవ్వనున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని జాతీయ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని బీజేపీ బృందం వాదిస్తోంది. ఈనెల 16వ తేదీన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం ఉండటంతో ఆ రోజుకి పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం వైఖరిని స్పష్టం చేయాలని ప్రతినిధి బృందం కేంద్ర మంత్రిని కోరనుంది. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే తీసుకుని పూర్తి చేయాలనే నివేదికను.. కన్నా బృందం సిద్ధం చేసింది. బీజేపీ బృందం ఇచ్చే నివేదిక తర్వాత కేంద్రం .. పీపీఏకు స్పష్టమైన సూచనలు ఇచ్చే అవకాశం ఉంది. ఆ మేరకు పదహారో తేదీన పోలవరంపై నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది.