అమరావతి అంశంపై జరిగిన చర్చలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై జరిగిన చెప్పు దాడి వ్యవహారంపై ఆ పార్టీ సీరియస్‌గా స్పందించింది. ఈ విషయంలో చర్చ జరిగిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ తప్పే ఎక్కువగా ఉందని నమ్ముతున్న బీజేపీ .. ఈ మేరకు కఠిన నిర్ణయం తీసుకుంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశాఖ బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. నిజానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. చర్చ జరుగుతున్నప్పుడే ఓ వీడియో విడుదల చేశారు. అప్పటికీ విష్ణువర్ధన్ రెడ్డి ఏబీఎన్ స్టడియోలోనే ఉన్నారు. చెప్పుదాడి చేసిన అమరావతి జేఏసీ నేత శ్రీనివాసరావుపై పోలీసు కేసు పెట్టి అరెస్ట్ చేయించాలని ఆయన ఏబీఎన్‌ను వీడియోలో డిమాండ్ చేశారు.
అయితే చర్చలో అలా చెప్పుతో దాడి చేయడం కరెక్ట్ కాదన్న యాంకర్ వెంకటకృష్ణ.. ఏబీఎన్ చర్చలకు ఇక శ్రీనివాసరావును పిలవబోమని ప్రకటించారు. కానీ అనూహ్యంగా తర్వాతి రోజే.. అంటే బుధవారం ప్రైమ్ టైమ్ చర్చను ఆయనతోనే ప్రారంభింపచేశారు. తన వాదన వినిపించే అవకాశం కల్పించారు. విష్ణువర్థన్‌రెడ్డితో గతంలో పరిచయం లేదని… తానెవరో తెలియకుండా పెయిడ్ ఆర్టిస్ట్ అనడం ఏమిటని ప్రశ్నించారు. చివరికి క్షణికావేశంలో విష్ణువర్థన్‌రెడ్డితో అలా ప్రవర్తించానని ఘటన దురదృష్టకరమైనదని చెప్పుకొచ్చారు. అయితే ఏబీఎన్ స్క్రీన్ పై మళ్లీ వెంటనే శ్రీనివాసరావు కనిపించడంతో బీజేపీ కోపం వచ్చింది. చర్చల్లో బహిష్కరిస్తామని చెప్పిన ఒక్క రోజులోనే ఆయనను పిలవడంతో… ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని బహిష్కరించాలని నిర్ణయానికి వచ్చారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో పాటు ఆంధ్రజ్యోతి పత్రికను కూడా మీడియా సమావేశాలకు ఆహ్వానించవద్దని… ఆ టీవీ చానల్ చర్చా కార్యక్రమాలలో బీజేపీ ప్రతినిధులు పాల్గొనరాదని బీజేపీ నిర్ణయించింది. ఎవరో ఒకర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి వారే బీజేపీ నేతలని ప్రచారం చేస్తే.. ఏబీఎన్‌పై కేసులు పెడతామని బీజేపీ హెచ్చరించింది. ఆంధ్రజ్యోతి యాజమాన్యం బేషరతుగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ కు క్షమాపణ చెప్పేవరకు ఈ బహిష్కరణ కొనసాగుతుందని తెలిపింది.
అత్తమీద కోసం దుత్తమీద చూపించినట్లుగా బీజేపీ వ్యవహారశైలి ఉంది. తనకు పార్టీలు అంటగట్టి… పెయిడ్ ఆర్టిస్ట్ అన్నందుకే.. శ్రీనివాసరావు… విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పు విసిరారు. తప్పు ఎక్కడ జరిగిందో విశ్లేషించకుండా.. చర్చా కార్యక్రమం జరిగిన టీవీ చానల్‌కు తప్పుడు ఉద్దేశాలు ఆపాదిస్తూ.. బీజేపీ నిర్ణయం తీసుకోవడం విస్మయకరంగా మారింది. ఏపీలో ఉన్న మీడియా పరిస్థితుల్లో బీజేపీకి ప్రచారం కల్పించేది ఒక్క ఆంధ్రజ్యోతినే. సాక్షిలో వైసీపీకి అనుకూలంగా మాట్లాడితే మాత్రమే వేస్తారు. లేకపోతే చంద్రబాబును తిట్టాలి. బీజేపీ కోసం మాట్లాడితే ఎక్కడా కవరేజీ రాదు. అంతో ఇంతో కవరేజీ ఇచ్చే మీడియాను దూరం చేసుకుని బీజేపీ నేతలు ఏం సాధిస్తారో మరి..!