ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతల వ్యవహార శైలి మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కల్యాణ్‌పై వైసీపీ అగ్రనాయకత్వం బూతుల దాడి చేస్తున్న బీజేపీ నేతలు స్పందించడం లేదు. పవన్‌కు మోరల్ సపోర్ట్‌గా రెండు మాటలు మాట్లాడుదామన్న ఆలోచన చేయలేదు. కానీ బద్వేలు ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చే సరికి మాత్రం ఉమ్మడి అభ్యర్థి అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెరపైకి వచ్చేశారు. జనసేనతో మాట్లాడి అభ్యర్థిని ఖారరు చేస్తామని ప్రకటించారు. బీజేపీ సీటు అడుగుతుందో లేదో ఆయన చెప్పలేదు.
తిరుపతి ఉపఎన్నికల్లో తామంటే తాము పోటీ చేస్తామని రెండు పార్టీల అభ్యర్థులు పోటీ పడ్డారు. చివరికి పవన్ కల్యాణ్ బీజేపీకి మద్దతివ్వక తప్పని పరిస్థితి కల్పించారు. కానీ ఆ ఎన్నికల్లో వారిద్దరి మధ్య పొత్తు వల్ల ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేదు. ఇప్పుడు బద్వేలు ఉపఎన్నికల్లో రెండు పార్టీల తరపున ఎవరు పోటీ చేసినా ప్రయోజనం ఉండదు. గత ఎన్నికల్లో రెండు పార్టీలకు కలిపి అక్కడ నోటా కంటే కూడా ఎక్కువ ఓట్లు రాలేదు. 2019 ఎన్నికల్లోనూ జనసేన పార్టీ అక్కడ పోటీ చేయలేదు. పొత్తులో భాగంగా బహుజన సమాజ్ పార్టీకి కేటాయించారు. జనసేన మద్దతిచ్చిన బీఎస్పీ 1321 ఓట్లు సాధించి ఆరో స్థానంలో ఉంటే ఒంటరిగా పోటీచేసిన బీజేపీ ఇంకా దారుణమైన ఫలితాన్ని చూసింది.
పైగా బీజేపీ తరపున పోటీ చేసింది సిట్టింగ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే తిరువీధి జయరాములు. వైసీపీ తరపున గెలిచిన ఆయన ఆ తర్వాత టీడీపీలో చేరారు. అక్కడ టిక్కెట్ ఇవ్వరన్న ఉద్దేశంతో బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేశారు. మొత్తంగా 735 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ రెండు పార్టీల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. నోటా నాలుగో స్థానంలో ఉంది. అసలు బద్వేలు ఉపఎన్నికపై జనసేన ఏ విధానం తీసుకుంటుందో ఇంకా స్పష్టత లేదు.