ఏపీ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశ పెట్టింది. 2024-25 సంవత్సరానికి సంబంధించి రూ. 2.94 లక్షల కోట్లతో పద్దును ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ ప్రతిపాదించారు. బడ్జెట్లో వ్యవసాయరంగానికి అత్యధికంగా రూ. 43,402.33 కోట్లు కేటాయించారు. అన్నదాత సుఖీభవ కోసం ఇందులో ఎక్కువ నిధుల్ని వెచ్చించనున్నారు. మొత్తం పద్దులో రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లు గా .. మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లు ఉంది. రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు కాగా ద్రవ్యలోటు రూ.68,743 కోట్లుగా పయ్యావుల ప్రకటించారు.
సూపర్ సిక్స్ పథకాల అమలు కోసం సహజంగానే ఎక్కువ నిధులు కేటాయించారు. సంక్షేమరంగానికి భారీ కేటాయింపులు జరిగాయి. పాఠశాల విద్య కోసం రూ. 29,909 కోట్లు కేటాయించారు. ఇందులో అత్యధికం తల్లికి వందనం స్కీములో భాగంగా నగదు బదిలీ చేస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖకు కూడా వ్యవసాయశాఖతో పోటీ పడి చెల్లింపులు ఉన్నాయి. అలాగే రోడ్ల కోసం ఎక్కువ నిధులు కేటాయించారు.
ప్రస్తుత ప్రభుత్వానికి నిధుల సమస్య భారీగా ఉన్నా.. కేంద్రం సహకారంతో పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నిధుల లభ్యతను దృష్టిలో పెట్టుకుని వనరుల్ని కేటాయించారు. కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం పెట్టుకున్న అన్ని విభాగాలకూ దండిగా నిధులు కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరం మరో ఐదు నెలలు మాత్రమే ఉంది. ఈ ఐదు నెలల్లోనే కీలక పథకాల అమలు పూర్తి చేయనున్నారు.