ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడెప్పుడు విశాఖ వెళ్లిపోదామా అన్న ఆత్రుతలో ఉన్నారు. ఇదిగో ఏ క్షణమైనా విశాఖకు అంటూ ప్రతీ రోజూ మంత్రులతో.. ఎంపీలతో ప్రకటనలు చేయిస్తున్నారు. కోర్టు తీర్పు తేలే వరకూ ఉండటం లేదని… సీఎం ఎక్కడి నుంచి పరిపాలిస్తే అదే రాజధాని కాబట్టి.. జగన్ కూడా.. క్యాంపాఫీసు చూసుకుని విశాఖ వెళ్లిపోతున్నారని చెబుతున్నారు. రాజధాని తరలింపు అని సాంకేతికంగా చెప్పకపోయినా… సీఎం మాత్రం తాడేపల్లిలో ఉండదల్చుకోలేదు. దీనిపై స్పష్టత ఉంది. అయితే అనూహ్యంగా.. తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటి సమీపంలో అసలు పేదల కాలనీలే ఉండకూడదన్న ఉద్దేశంతో అక్కడ ఉన్న కాలనీల్ని ఖాళీ చేయించడానికి అధికారులు బలప్రయోగం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్ ఇల్లు.. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ అభివృద్ధి చేసిన లే ఔట్లో రెండు ఎకరాల స్థలంలో ఉంటుంది. మిగిలిన స్థలంలో విల్లాల్లాంటి నిర్మాణాలు కట్టారు. ఒక్క సీఎం జగన్కు మాత్రం… రెండు ఎకరాల స్థలంలో ఇల్లు ఉంది. ఆ ఇల్లు తాడేపల్లి కాలువకట్టకు దగ్గరగా ఉంటుంది. కాలువ కట్ట మీద ముఫ్పై ఏళ్లుగా అమరారెడ్డి నగర్ అనే కాలనీలో నిరుపేదలు ఇళ్లు కట్టుకుని నివసిస్తున్నారు. ఇప్పుడు అక్కడ జగన్ ఇల్లు కట్టుకోవడం వారికి శాపంగా మారింది. జగన్ క్యాంప్ ఆఫీస్ అక్కడ ఉన్నప్పటి నుండి ఆ కాలనీని ఖాళీచేయించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. బయట ఎక్కడైనా ఇళ్లు నిర్మించి అక్కడికి పొమ్మంటే వెళ్లేవారేమో కానీ.. ముందు ఖాళీ చేసి వెళ్లిపోతే తర్వాత ఇళ్లిస్తామని చెబుతూండటంతో అక్కడి పేదలు విలవిల్లాడిపోతున్నారు.
ఇక్కడ ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయేవారికి మంగళగిరి పరిధిలోని ఆత్మకూరు వద్ద రెండు సెంట్ల స్థలం చూపించారు. కానీ ఏళ్ల తరబడి చేసన కష్టంతో కట్టుకుని ఇంటిని వదిలేసి..అక్కడ ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వ సాయం మాటల్లోనే ఉంది. దీంతో ఎవరూ వెళ్లడానికి ఇష్టపడటం లేదు. ఇది వివాదాస్పదమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.వాళ్లు కాలువ కట్ట మీదే ఇళ్లు కట్టుకుని ఉండవచ్చు కానీ… అలా ఏమీ చూపించకుండా ఖాళీచేయించడం.. కూల్చివేయడం సరి కాదన్న చర్చ జరుగుతోంది. అసలు జగన్ తాడేపల్లిలోనే ఉండదల్చుకోలేనప్పుడు.. ఎందుకు కాలనీని ఖాళీ చేయిస్తున్నారనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం అవుతోంది.