ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ అత్యంత కీలకం. భారత రాజ్యాంగంలో ఎన్నికల నిర్వహణకు చాలా ప్రాధాన్యత ఉంది. అలాంటి ఎన్నికల నిర్వహణకు ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించడం తీవ్ర నేరం అవుతుంది. పంచాయతీ మొదటి విడత ఎన్నికల వాయిదాకు అలాంటి నేరమే కారణం అయింది. జిల్లాల్లో అధికారులెవరూ పట్టించుకోలేదు. దానికి కారణం… పై నుంచి ఆదేశాలు అందడమే. ఆ ఆదేశాలు ఇచ్చిన వారెవరన్నదానిపై దృష్టి పెట్టిన నిమ్మగడ్డ… చివరికి ప్రవీణ్ ప్రకాష్‌గా తేల్చారు. ఆయనను బదిలీ చేయాలని ఆదేశించారు. అయితే ప్రవీణ్ ప్రకాష్ అనూహ్యంగా తనకేమీ తెలియదని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కే రిప్లయ్ ఇచ్చారు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే… తాము సీఎస్‌కు సహాయకారినే కానీ నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని కాదంటున్నారు.
ప్రవీణ్ ప్రకాష్.. సీఎంవో ప్రిన్సిపుల్ సెక్రటరీ. ఆయన పవర్ గురించి పొలిటికల్… బ్యూరోక్రాట్ సర్కిళ్లలో అందరికీ తెలుసు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేయగలిగిన రేంజ్ ఆయనది. అయితే ఇప్పుడు… ఎన్నికల కమిషన్ తో వివాదం వచ్చే సరికి ఆయన మాట మార్చేశారు. తాను సీఎంవోలోని ఐదుగురు ప్రిన్సిపుల్ సెక్రటరీల్లో ఒకరినని.. సీఎస్‌కు సహాయకారిగా మాత్రమే ఉంటానని అంటున్నారు. మొదటి దశ ఎన్నికల నిర్వహణకు సహకరించవద్దని తాను అధికారులకు చెప్పలేదన్నారు. ప్రభుత్వ ఆదేశాలను మాత్రమే పాటించానని అంటున్నారు. ఇక్కడ ప్రభుత్వ ఆదేశాలు అంటే.. సీఎస్ ఆదేశాలు. సీఎస్ ఆదేశాలు మాత్రమే పాటించి.. అధికారులెవరూ.. నిమ్మగడ్డ సమీక్షకు హాజరు కాకూడదని ఆయన చెప్పారట.
నిజానికి ప్రవీణ్ ప్రకాష్ ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కల్పించే నాటికే హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అంటే ప్రభుత్వ అధికారులు మొత్తం ఎస్ఈసీ చెప్పినట్లుగా చేయాల్సి ఉంటుంది. కానీ ప్రవీణ్ ప్రకాష్ చేయకపోగా.. వ్యతిరేకంగా చేయించారు. ఎన్నికల ప్రక్రియను బలహీనం చేసే ప్రయత్నం చేశారు. అయితే నిజంగా ఆయనకు ఉన్న పదవికి.. ఆయన చేసే పనులకు సంబంధం ఉండదు. అందుకే ఇప్పుడు ఆయన తెలివిగా మొత్తం సీఎస్ పై తోసేస్తునన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే కోర్టు ధిక్కరణ కేసులో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పేరును కూడా హైకోర్టు కలిపింది. ఇప్పుడు ఎన్నికల వాయిదాకూ సీఎస్సే కారణమని చెప్పి.. ప్రవీణ్ ప్రకాష్ వైదొలిగితే… మొత్తం అధికార యంత్రాంగంలోనే ఓ కుదుపు వస్తుంది.