ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ సీనియర్ ఐఏఎస్ అధికారులందరితో సుదీర్ఘం గా సమావేశమయ్యారు. వారితోనే లంచ్ చేశారు. అన్ని మాటలూ మాట్లాడుకున్నారు. చివరికి ఈ భేటీ సారాంశం ఏమిటంటే… అందరూ పని చేయాలని. అదీ కూడా సచివాలయానికి వచ్చి పని చేయాలని సాఫ్ట్‌గా చెప్పడం. పది రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ఓ సమీక్షలో ఐఏఎస్ అధికారులు ఎక్కువగా సచివాలయానికి రావడం లేదని తెలిసింది. దీంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు సచివాలయానికి రావడం లేదంటే పని చేయడం లేదని అర్థం కాదని ఈ ఆఫీస్ విధానం ద్వారా పని చేస్తున్నారని అంటున్నారు. అయితే క్యాంపాఫీస్ అంటే ఇంట్లో నుంచి లేకపోతే విభాగాధిపతుల కార్యాలయాల నుంచి పని చేస్తున్నారని సీఎస్ సీఎంకు వివరించారు.
అయితే.. సీఎం జగన్ మాత్రం సంతృప్తి చెందలేదు. ఐఏఎస్ అధికారులే ఆఫీసులకు రాకపోతే ఇక ఉద్యోగులు ఎలా వస్తారని.. ఇక నుంచి అందరూ ఆఫీసులకు వచ్చి పని చేసేలా చూడాలని సీఎస్‌ను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. సచివాలయానికి రాకుండా వీలైనంత వరకూ వర్క్ ఫ్రం హోం లేదా.. వర్క్ ఫ్రం డిపార్టుమెంట్ అన్నట్లుగా పని చేసుకుపోతున్న ఐఏఎస్ అధికారులకు సీఎస్ అదిత్యనాథ్ సీఎం జగన్ చెప్పినట్లుగా చెప్పలేరు. అందుకే.. అందరినీ సమావేశానికి పిలిచి.. లంచ్ ఏర్పాటు చేసి.. సీఎం జగన్ ఇలా అన్నారు.. ఇక నుంచి సచివాలయానికి రావాల్సిందేనని స్పష్టం చేశారు. కరోనా కారణంగా బయోమెట్రిక్‌ను ఐఏఎస్‌లకు నిలిపివేశారు. ఇక నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. అయితే.. సచివాలయానికి ముఖ్యమంత్రే రారు కదా.. మనం ఎక్కడ నుంచి పని చేస్తే ఏమిటి అన్న భావనలో కొంత మంది ఉన్నారు .
ఈ విషయం సీఎం జగన్‌కు అర్థమయిందేమో కానీ తాను కూడా పది రోజులకోసారి సచివాలయానికి వచ్చి సమీక్షా సమావేశాలను నిర్వహిస్తాననే సందేశాన్ని ఉన్నతాధికారులకు పంపించారు. సీఎం జగన్ రోజువారీ కార్యకలాపాలు క్యాంప్ ఆఫీసులోనే ఉంటాయి. మంత్రివర్గ సమావేశాలు ఉంటే తప్ప… ఆయన సచివాలయానికి వెళ్లరు. దీంతో ఉన్నతాధికారులు కూడా ఏమైనా సమీక్షలు ఉంటే నేరుగా సీఎం క్యాంపాఫీస్‌కు వెళ్లి అటు నుంచి అటే ఇళ్లకో… ఇతర చోటకే వెళ్లిపోతారు కానీ సచివాలయానికి వెళ్లరు. ఈ పరిస్థితిని మార్చి అందరూ ఆఫీసులకు వచ్చేలా చూడాలని జగన్ ఆదేశించారు. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ప్రయత్నిస్తున్నారు. మరెంత వరకూ వర్కవుట్ అవుతుందో మరి..!