ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశంలో మరిన్ని సంక్షేమ పథకాలకు ఆమోద ముద్ర వేశారు. సంక్షేమ క్యాలెండర్లో భాగంగా సెప్టెంబర్‌లో పదకొండో తేదీన వైఎస్ఆర్ ఆసరాను ప్రారంభించాల్సి ఉంది. ఈ పథకం కింద.. కోటి మంది వరకు ఉన్న డ్వాక్రా మహిళలకు రుణమాఫీ పథకాన్ని అమలు చేయాలి. యాభై వేల రూపాయల రుణాన్ని నాలుగేళ్లలో మాఫీ చేస్తాని జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అంటే..ఒక్కొక్క డ్వాక్రా మహిళకు రూ. 12500 మాఫీ చేయాల్సి ఉంది. ఈ పథకానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. 9 లక్షల 33 వేల డ్వాక్రా గ్రూపులకు లబ్ది చేకూరుతుందని.. మొదటి ఏడాది రూ. 6792 కోట్లను డ్వాక్రా మహిళలకు పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
అలాగే.. జగనన్న విద్యాకానుక ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. 3 జతల యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్‌తో పాటు నోట్ పుస్తకాలు అందించాలని కిట్‌లో ఉంటాయి. 42 లక్షల 32 వేల మందికి వచ్చే నెల 5న కిట్లను అందిస్తారు. ఇక గర్భిణీలు, బాలింతలు, పిల్లలకోసం వచ్చే నెల 1 న వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రారంభిస్తారు. అలాగే డిసెంబర్ ఒకటి నుంచి ఇంటింటికీ నాణ్యమైన బియ్యం అందించాలని మంత్రివర్గం నిర్ణయంతీసుకుంది. వాస్తవానికి ఈ నిర్ణయం మొదటి మంత్రివర్గ సమావేశంలోనే తీసుకున్నారు. పధ్నాలుగు నెలలు గడిచినప్పటికీ… ఇప్పటికీ కేబినెట్లో ఆమోదించారనే ప్రభుత్వం చెబుతోంది. మూడు నెలల కిందట..సెప్టెంబర్ నుంచి అమలు చేస్తామని చెప్పింది. ఇప్పుడు దాన్ని కేబినెట్లో నిర్ణయం పేరుతో డిసెంబర్‌కు మార్చారు. 9260 వాహనాల ద్వారా ఇంటివద్దనే తూకం వేసి బియ్యం పంపిణీ చేస్తామని.. బీసీ,ఎస్సీ,ఎస్టీ యువకులకు వాహనాలు సబ్సిడీపై అందజేస్తామని చెప్పారు. అంటే రేషన్ డీలర్లకు బదులు ఆ వాహనాలు ఉన్న వారికి కమిషన్ ఇస్తారని అంచనా వేస్తున్నారు. మామూలుగా అయితే వాలంటీర్లు పంపిణీ చేయాల్సి ఉంది.
అలాగే రూ. 583 కోట్లతో బియ్యం కార్డు దారులకు వైఎస్సార్ భీమా పధకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొన్ని విధానపరమైన నిర్ణయాలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొద్ది రోజుల కిందట ప్రకటించిన కొత్త పారిశ్రామిక విధానానికి .. ఏపీ బల్క్ డ్రగ్ కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోద ముద్ర వేశారు. ఏపీ ఆక్వా కల్చర్ సీడ్ క్వాలిటీ కంట్రోల్ చట్టంలో సవరణలకు ఆమోదం తెలిపారు. పెన్షన్‌ను మూడు వేలకు పెంచుకుంటూ పోతామనే హామీలో భాగంగా… రూ. 250 పెంచాల్సిన గడవు దాటిపోయి మూడు నెలలు దాటినా ప్రభుత్వం దానిపై నిర్ణయం తీసుకోలేదు.