ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్థానిక, మున్సిపల్ ఎన్నికలను మెరుపువేగంతో పూర్తి చేయాలని నిర్ణయానికి వచ్చింది. తెలంగాణ సర్కార్ ఈ ఫార్ములాను ఉపయోగించి.. మంచి ఫలితాలు సాధించింది. అదే పద్దతిలో స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఈ మేరకు మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. మార్చి 15లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయిచిన మంత్రి వర్గం… నోటిఫికేషన్ వచ్చిన 15రోజుల్లో ఎన్నికలు పూర్తిచేయాలని డిసైడ్ చేసింది. అంటే.. నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ, ప్రచారం, పోలింగ్, ఓట్ల లెక్కింపు మొత్తం .. పదిహేను రోజుల్లో అయిపోతాయన్నమాట.
డబ్బు, మద్యం ప్రభావం లేకుండా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని… డబ్బు పంచుతూ అభ్యర్థి దొరికితే అనర్హత వేటు, మూడేళ్ల జైలుశిక్ష విధిస్తామని మంత్రి పేర్ని నాని ప్రకటించారు. పంచాయతీ ఎన్నికలకు 8 రోజులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు 5రోజుల పాటు ప్రచార గడువు ఖరారు చేశారు. సర్పంచ్లకే పారిశుద్ధ్యం, పచ్చదనం బాధ్యతల ఇస్తామని.. సర్పంచ్ స్థానికంగా ఉంటూ పాలన సాగించాల్సిఉంటుందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో నియమావళినే మున్సిపల్ ఎన్నికల్లో అమలు చేస్తామని ప్రకటించారు. ఎన్నికలు నిర్వహించడమే ఆలస్యం కానీ… రెండు వారాల్లో ఫటాఫట్ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది.
స్థానిక ఎన్నికలకు సంబంధించిన కీలక నిర్ణయాలతో పాటు ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ముసాయిదా బిల్లు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు, ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటు వంటి నిర్ణయాలను కేబినెట్ తీసుకుంది. 10వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం జెన్కో ద్వారా గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.