విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంతోపాటు హైదరాబాద్ లో కూడా ఒకే రోజున భారీ సంఖ్యలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ దాడుల్లో ఎక్కువ శాతం టీడీపీ మద్దతుదారులు, ఆ పార్టీకి చెందిన నాయకులనే ప్రధాన లక్ష్యంగా చేసుకుని రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా జరిగినవిగానే టీడీపీ భావిస్తోంది. ఇదే అంశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది. ఆంధ్రాపై కేంద్రం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందనీ, లేదంటే ఒకేసారి వందల మంది అధికారులను ఆంధ్రాలో దింపాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని సీఎం మండిపడ్డారు.
ఆంధ్రాలో ఏదో జరిగిపోతోందన్న ఒక ఆందోళన సృష్టించే ప్రయత్నంగా తాజా దాడులను క్యాబినెట్ సమావేశంలో విశ్లేషించారు. ఆదాయ పన్ను శాఖ చేసే రాజకీయ దాడులకు మద్దతు ఉండదని మంత్రులతో సీఎం స్పష్టం చేశారు. ఇన్ని బృందాలను ఒకేసారి రాష్ట్రంలో దించాల్సిన పనేముందనీ, లా అండ్ ఆర్డర్ రాష్ట్ర పరిధిలోని అంశమని మంత్రులతో సీఎం అన్నారు. అంతేకాదు, ఐటీ దాడులకు వచ్చిన అధికారుల భద్రతను ఉపసంహరించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఇంకోపక్క, కేంద్ర రాష్ట్ర సంబంధాలను దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారు అనే కోణంలో సుప్రీం కోర్టులో న్యాయ పోరాటానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలించాలంటూ లా సెక్రటరీకి సీఎం ఆదేశించారు.
క్యాబినెట్ భేటీ అనంతరం టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ… వందల మంది అధికారులు రాష్ట్రానికి వచ్చి, ఒక భయానక వాతావరణం కలిగించే విధంగా, ముఖ్యంగా పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించాలనే ప్రయత్నమే ఇది అన్నారు. ఆంధ్రాలో స్వేచ్ఛగా వ్యాపార లావాదేవీలను పారిశ్రామికవేత్తలు సాగించకూడదనే దురుద్దేశం ఈ దాడుల వెనక చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. క్యాబినెట్ భేటీలో చాలామంది సహచరులు ఇదే అభిప్రాయపడ్డారనీ, మంత్రులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని కాల్వ అన్నారు. కేంద్రం నుంచి మరిన్ని కవ్వింపులు చర్యలు ఉండే అవకాశం కనిపిస్తోందనీ, ఈ నేపథ్యంలో టీడీపీ నేతలూ శ్రేణులూ అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు సీఎం సూచించినట్టుగా కూడా తెలుస్తోంది. ఏపీలో ఐటీ దాడులను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గానే తీసుకుంది. మరి, ఏపీ క్యాబినెట్ నిర్ణయంపై భాజపా స్పందన ఎలా ఉంటుందో చూడాలి.