రెండున్నరేళ్ల తరవాత ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎనభై మందిని తీసేసి.. కొత్త వారిని తీసుకుంటానని జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం అప్పుడే చెప్పారు.అయితే.. కొంత మందికి రెండున్నరేళ్ల వరకూ చాన్స్ ఉండే అవకాశం కనిపించడం లేదు. ఇలాంటి వారిలో ఇద్దరు ఇప్పటికే అవుట్ అయ్యారు. వారిద్దరు.. శాసనమండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్. మండలి రద్దు కోసం తీర్మానం చేయడంతో వారి స్థానంలో కొత్తగా ఇద్దరిని తీసుకుంటారు. వీరికి రాజ్యసభ కూడా ఇవ్వడం దాదాపు ఖరారు అవడంతో.. తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు రాని జిల్లాల నుంచి మంత్రుల్ని కూడా రాజీనామా చేయిస్తానని ప్రకటించారు. దాంతో.. మరికొన్ని ఖాళీలు ఖాయమన్న చర్చ జరుగుతోంది.
అందుకే.. వైసీపీలో ఇప్పటికే ఏప్రిల్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం ఊపందుకుంది. ఇద్దరు బీసీ మంత్రుల్ని తీసేస్తున్న తరుణంలో.. రెండు పదవులూ బీసీలకే కేటాయించాల్సి ఉంది. దాంతో బీసీ ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. ఇక.. జగన్మోహన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారని భావిస్తున్న మరికొంత మంది మంత్రులపైనా వేటు పడే అవకాశం ఉంది. ఆశావహులంతా.. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడేందుకు ఇప్పటి నుండే పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే.. ఈ మంత్రివర్గ విస్తరణ ప్రచారాన్ని వ్యూహాత్మకంగా చేస్తున్నారన్న అభిప్రాయం కూడా… వైసీపీలో ఉంది. స్థానిక ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలందర్నీ అప్రమత్తం చేయడానికి.. ఆశావహులంతా.. తీవ్రంగా శ్రమించి.. పార్టీని గెలిపించడానికి సమాయత్తం చేసేందుకే ఈ ప్రచారం చేస్తున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. మంచి ఫలితాలు సాధించిన వారిని జగన్ గుర్తిస్తారని.. 90 శాతం స్థానిక సంస్థల్లో విజయాలు సాధించాలన్న టార్గెట్ను ఎమ్మెల్యేలకు పెట్టినట్లుగా తెలుస్తోంది.