ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, దానిలో ఒక ముస్లిం వ్యక్తికి అవకాశం కల్పిస్తానని చెప్పినప్పటి నుంచి మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. తెదేపా నేతలు, మంత్రులు చేస్తున్న లోకేష్ భజన వింటే ఆయన పేరు ఖరారు అయిపోయిందని స్పష్టమవుతోంది. మంత్రివర్గంలోకి తీసుకోబోయే ఆ ముస్లిం వ్యక్తి తెదేపాకు చెందిన వారా లేకపోతే వైకాపా నుంచి ఇటీవల తెదేపాలోకి దూకేసిన విజయవాడ పశ్చిమ నియోజక వర్గ ఎమ్మెల్యే జలీల్ ఖానా అనేది ఇంకా తేలవలసి ఉంది.
మంత్రివర్గ విస్తరణలో కొత్తగా 8 మందికి మంత్రి పదవులు దక్కబోతున్నట్లు తెలుస్తోంది. వారిలో ఒకరు వైకాపా నుంచి వచ్చిన వ్యక్తి అంటే జలీల్ ఖాన్ లేదా జ్యోతుల నెహ్రు లేదా భూమా నాగిరెడ్డి లేదా ఆయన కుమార్తె అఖిలప్రియలలో ఎవరో ఒకరికి అవకాశం దక్కవచ్చునని సమాచారం. తెదేపా నుంచి నారా లోకేష్, పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గాలి ముద్దు కృష్ణం నాయుడు, కాలవ శ్రీనివాసులు, ధూళిపాళ నరేంద్ర, మాడుగుల వేణుగోపాల్ రెడ్డి, కిమిడి కళా వెంకటరావు, బాలకృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి. తెదేపాలో ఇంకా బుచ్చయ్య చౌదరి, గొల్లపల్లి, బండారు, పతివాడ వంటి అనేకమంది సీనియర్లు కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు కానీ అందరికీ అవకాశం కల్పించడం సాధ్యం కాదు కనుక ఈసారికి కేవలం 8 మందినే మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇంకా మంత్రి పదవులు కోల్పోయేవారిలో రావెల కిషోర్ బాబు పేరే అందరికంటే పైనుంది. ఆయన కాక ఒక మహిళా మంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, కనీసం ఇద్దరు మంత్రులకు పదవీ గండం ఉండవచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. కొందరిని వేరే శాఖలకు బదిలీ చేసే అవకాశం ఎలాగూ ఉంది.
మంత్రి వర్గ విస్తరణ, ప్రక్షాళనలో కొత్తగా మంత్రులయ్యేవారి, పదవులు కోల్పోయేవారి పేర్లను ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నా, లోకేష్ మంత్రి అవడం, దసరా పండుగ రోజున మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే విషయంలో ఎటువంటి భినాభిప్రాయాలు లేవు. కానీ తాజా సమాచారం ఏమిటంటే మంత్రివర్గ విస్తరణ దసరా రోజున కాకుండా ఉగాది పండుగ సందర్భంగా రేపే జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దాని కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయినట్లు తెలుస్తోంది. కానీ ఈ వార్తను తెదేపాలో ఎవరూ అధికారికంగా దృవీకరించలేదు. కనుక మంత్రివర్గ విస్తరణ, ప్రక్షాళన రేపే జరుగబోతోందా లేక దసరాకి జరుగుతుందా ఇంకా తెలియవలసి ఉంది.