ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం.. ఇప్పుడు… దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో మంత్రివర్గ సమావేశం అనేదే.. ఎవరూ ఊహించని విషయం. కానీ.. నరేంద్రమోడీ… నాలుగు సార్లు కేబినెట్ భేటీ పెట్టడం, కోడ్ పేరుతో.. తన ప్రభుత్వంపై పరిమితులు విధించడంతో.. చంద్రబాబు… పంతానికి పోయి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌లో ఎక్కడా.. కేబినెట్ భేటీ నిర్వహించకూడదని లేదు. దాంతో.. ఈసీ తన పరిమితుల మేరకు అనుమతులు ఇవ్వక తప్పలేదు.
నిర్ణయాలు తీసుకోకుండా ఆపే శక్తి ఈసీకి లేదు..!
భారత ప్రజాస్వామ్యంలో.. అత్యున్నత నిర్ణాయక మండలి కేబినెట్. మంత్రివర్గ నిర్ణయమే అత్యున్నతం. ఎవరూ ప్రశ్నించడానికి లేదు. ఎన్నికల కోడ్‌లోనూ.. ఈ ప్రస్తావన లేదు. అయితే.. ఓటర్లను ప్రభావితం చేయకూడదనే అంశం ఉండటంతో.. అలాంటి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం.. ఈసీ నిలువరించే అవకాశం ఉంది. అందుకే.. కేంద్ర ఎన్నికల సంఘం.. కేబినెట్ భేటీ ఎజెండాకు అనుమతి ఇస్తూ.. కొన్ని కీలక సూచనలు చేసింది.. ధరల సవరణ, బకాయిల చెల్లింపు వంటి నిర్ణయాలు తీసుకుంటే..ఈసీకి తెలియజేయాలి. ఈసీ అనుమతి ఇచ్చిన తర్వాతే అమలు చేయాలి. అంత వరకూ కనీసం మీడియాకు కూడా తెలియకూడదు. ఈ నిబంధనల ప్రకారం చూస్తే.. కేబినెట్లో ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవడం అవకాశం ఉందని.. అర్థమైపోతుంది.
కీలక బిల్లుల చెల్లింపులకు కేబినెట్లో గ్రీన్ సిగ్నల్..?
కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన ఎజెండాకు… గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దాని అర్థం కేవలం వాటి మీద చర్చించి నిర్ణయాలు తీసుకోవచ్చని కాదు. కేబినెట్ భేటీలో దేనిపై అయినా నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. టేబుల్ అజెండాగా.. ఏ అంశాన్నైనా తీసుకు రావొచ్చు. కేబినెట్ భేటీ ఎందుకు అంటే.. వైసీపీ నేతలు ప్రధానంగా చేస్తున్న ఆరోపణలు పోలవరం చెల్లింపులు.. ఇతర అంశాలన్న ప్రచారం జరుగుతోంది. వీటిపై కేబినెట్ నిర్ణయం తీసుకోవడానికి సంపూర్ణ హక్కులు ఉన్నాయి. తీసుకోవచ్చు కూడా. కానీ బయటకు తెలియడానికి అవకాశం లేదు. ఈసీ అనుమతి ఇచ్చిన తర్వాతే తెలుస్తుంది. పోలవరం చెల్లింపులు చేయవద్దని… విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి సోమిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆ విషయం చెప్పడానికి సాయిరెడ్డి ఎవరని ప్రశ్నించారు. ఈసీలో వైసీపీ జోక్యం ఎక్కువయిందని విమర్శలు గుప్పించారు. సోమిరెడ్డి స్పందన చూసిన తర్వాత కేబినెట్లో చెల్లింపుల నిర్ణయాలు ఉంటాయని.. అర్థం చేసుకోవచ్చు.
అడ్డుకునే శక్తి సీఎస్‌కు ఉందా..?
మంత్రి వర్గ సమావేశం జరగడం ఇష్టం లేని మొట్ట మొదటి వ్యక్తి సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం. బిజినెస్ రూల్స్ విషయంపై చర్చ జరిగితే… ఈ నెల కాలంలోనే… తాను చేసిన వ్యవహారాలు బయటకు వస్తాయని.. అదే జరిగి… కేబినెట్ చర్యలకు సిఫార్సు చేస్తే.. మొత్తానికి మోసం వస్తుందని ఆయన ఆందోళన చెందుతున్నారు. అందుకే.. కేబినెట్ భేటీ ప్రస్తావన వచ్చిన తర్వాత ఆయన టోన్ మార్చారు. ఓ సారి సీఎంతోనూ సమావేశమయ్యారు. రాజ్యాంగం ప్రకారం.. కేబినెట్ నిర్ణయాలను అమలు చేయాల్సింది సీఎస్. ప్రశ్నించడానికి లేదు. అయితే.. సీఎస్ ఏం చేస్తారనేది.. ఆసక్తికరంగా మారింది. సీఎంకు అధికారాల్లేవని నేరుగా..మీడియాకు చెప్పిన ఎల్వీ.. ఇప్పుడు.. అదే సీఎం నేతృత్వంలోని కేబినెట్ నిర్ణయాలను అమలు చేయాల్సి ఉంది. మరి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటే అమలు చేస్తారా..? అన్నదే ఆసక్తి రేపుతోంది.