నేడు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగబోతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా రాజధానికి మిగిలిన భూముల సేకరణ, హైదరాబాద్ నుండి ఉద్యోగులు, ప్రభుత్వ శాఖల తరలింపు, మచిలీపట్నం ఓడరేవు, విజయనగరం జిల్లాలో భోగాపురం గ్రామంలో విమానాశ్రయానికి భూసేకరణ, ఈ నెల 9 నుండి ప్రభుత్వం మొదలుపెట్టబోతున్న చంద్రన్న రైతు యాత్ర తదితర అంశాల గురించి చర్చిస్తారు. ఇప్పటికే రాజధాని భూసేకరణలో రైతుల నుండి ప్రతిపక్షాల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి మచిలీపట్నం, భోగాపురం రైతులు కూడా భూసేకరణని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కనుక ఈ సమావేశంలో ఈ సమస్యపైన ప్రధానంగా చర్చ జరుగవచ్చును. రాజధాని నిర్మాణ పనులు వచ్చేనెల 22న దసరా నుండే మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నందున పెనుమాక తదితర గ్రామాలలో భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్న రైతుల నుండి ఏవిధంగా భూమి సేకరించాలనే అంశంపై కూడా చర్చ జరుగవచ్చును. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షాలు చేస్తున్న ధర్నాలు, బందులు, ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో ఆత్మహత్యలు వంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరుగవచ్చును. ఈ సమావేశం ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురుపూజా దినోత్సవంలో పాల్గొనేందుకు విశాఖపట్నం వెళ్తారు.