ఇవ్వాళ్ళ విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో రాష్ట్రాన్ని పట్టి కుదిపివేస్తున్న కాల్ మనీ వ్యవహారంపైన ప్రధానంగా చర్చించవచ్చును. ఈ వ్యవహారంలో ఎక్కువగా తెదేపా నేతల పేర్లే బయటపడుతుండటంతో దాని వలన పార్టీకి, ప్రభుత్వానికి కూడా చాలా చెడ్డపేరు వస్తోంది. అలాగే ఈ కాల్ మనీ అక్రమ వ్యాపారం రాష్ట్రంలో మిగిలిన జిల్లాలలో కూడా వ్యాపించి ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారం ఇంకా కొనసాగినట్లయితే పార్టీకి, ప్రభుత్వానికి కూడా తీవ్ర నష్టం జరుగుతుంది కనుక వీలయిననంత త్వరగా దీనిని అరికట్టడానికి తీసుకోవలసిన చర్యల గురించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ వ్యవహారంతో సంబందం ఉన్న తెదేపా నేతలపై పార్టీ పరంగా, ప్రభుత్వపరంగా తీసుకోవలసిన చర్యలు గురించి ఈ సమావేశంలో చర్చించవచ్చును. అలాగే కల్తీ మద్యం కేసు, అక్రమ ఇసుక రవాణా వంటి సమస్యల గురించి చర్చించే అవకాశం ఉంది. త్వరలో జరుగబోయే శాసనసభ సమావేశాలలో చర్చించవలసిన అంశాలు, ప్రవేశపెట్టవలసిన బిల్లుల గురించి ఈరోజు మంత్రివర్గ సమావేశంలో చర్చించవచ్చును. ప్రస్తుతం అమలులో ఉన్న ఇసుక సరఫరా విధానంలో కనుగొన్న లోపాలను సరిచేసి జనవరి నుండి కొత్త ఇసుక విధానం అమలుచేయబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. కనుక ఈ సమావేశంలో దానిపై కూడా చర్చ జరుగవచ్చును.