ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి శంఖు స్థాపనకి రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. అక్టోబరు 22న మధ్యాహ్నం 12.45గంటలకు ముహూర్తంగా నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రాజధానికి శంఖు స్థాపన చేస్తారు. ప్రధానితో బాటు జపాన్, సింగపూర్ దేశాల ప్రధానులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి రాజకీయ నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఈ కార్యక్రమానికి హాజరవుతారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి సుమారు లక్ష మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్టుగానే భారీ ఏర్పాట్లు చేస్తోంది.శంఖుస్థాపన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించే బాధ్యతని ముంబై కి చెందిన విజ్ క్రాఫ్ట్స్ అనే ఈవెంట్ మేనేజి మెంట్ సంస్థకు అప్పగించారు. ఈ నెల 13నుండి 22వరకు రాజధాని శంఖు స్థాపన కార్యక్రమాన్ని ఒక పండుగలాగ నిర్వహించబోతున్నట్లు మంర్తి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.
ప్రస్తుతం ఉద్దండరాయునిపాలెం ఉన్న ప్రదేశంలో 25 ఎకరాలలో ఆంద్రప్రదేశ్ సంస్కృతిని ప్రతిభింబించే విధంగా ఒక పైలాన్ నిర్మించబోతోంది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, వారి కుటుంబ సభ్యుల పేర్లు, ఎంత భూమి ఇచ్చినది వగైరా అన్ని వివరాలతో కూడిన శిలాఫలకాలు అక్కడ ఏర్పాటు చేస్తారు. అదే విధంగా రాజధానికి ఎవరెవరు ఎంత సహాయం చేసినది, రాజధాని నిర్మాణంలో ఏఏ సంస్థలు పాలుపంచుకొన్నాయో వాటి వివరాలు అన్నీ నిక్షిప్తం చేస్తూ ఒక శిలాఫలకాలు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో అన్ని గ్రామాల నుండి సేకరించిన మట్టితో అక్కడ ఒక కలశం ఏర్పాటు చేస్తారు.