ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం ఖరాఖండిగా తేల్చి చెప్పిన తరువాత రాష్ట్రంలో మళ్ళీ ఆందోళనలు మొదలయిన నేపద్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు డిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కావడం చాలా ప్రాధాన్యత సంతరించుకొంది. ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో గొడవ పడే ఉద్దేశ్యం లేదని చంద్రబాబు నాయుడు కూడా స్పష్టం చేశారు కనుక, ఆయన దాని కోసం పట్టుబట్టకుండా మిగిలిన హామీల అమలుకు ముఖ్యంగా నిధుల విడుదల, రైల్వే జోన్ ఏర్పాటు, కరువు సహాయం కోసమే ఒత్తిడి చేయవచ్చని భావించవచ్చు. రాష్ట్రానికి రావలసింది కొండంతయితే ఇచ్చింది గోరంత అని రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అనడం గమనిస్తే ముఖ్యమంత్రి నిధుల విడుదలకే ప్రధానిపై ఒత్తిడి చేయవచ్చని స్పష్టమవుతోంది. రెండేళ్ళు పూర్తయినా ఇంతవరకు రాజధాని నిర్మాణం, పోలవరం, మెట్రో రైల్ పనులు మొదలవలేదు. అలాగే రైల్వే జోన్ కూడా ఏర్పాటు కాకపోవడంతో దానికోసం వైకాపా దీక్షలు, ఆందోళనలు చేస్తోంది. కానీ దానిపై కూడా కేంద్రం ఇంతవరకు స్పందించకపోవడంతో తెదేపా, భాజపాలకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తోంది. అదే విషయం ప్రధానికి వివరించి, రైల్వే జోన్ ఏర్పాటు కోసం ఒప్పించవచ్చు. అలాగే మిగిలిన అంశాల కోసం ప్రధానిపై ఒత్తిడి తెచ్చి ఏదో ఒక నిర్దిష్టమయిన హామీ, ప్రకటన చేయించవచ్చు. కానీ ఆయన ఒత్తిడికి ప్రధాని నరేంద్ర మోడీ తలొగ్గుతారా లేదో చూడాలి. ఒకవేళ ఈసారి కూడా కేంద్రం నుంచి దేనిపైనా నిర్దిష్టమైన హామీ, ప్రకటన చేయించలేకపోతే, రాష్ట్రంలో ప్రజలు, ప్రతిపక్షాలు కూడా అది చంద్రబాబు నాయుడు వైఫల్యంగానే చూడవచ్చు కనుక కేంద్రం పట్ల తెదేపా వైఖరిలో క్రమంగా మార్పులు ప్రదర్శించవచ్చు. కానీ దాని వలన ఆ రెండు పార్టీలకి, రాష్ట్రానికి కూడా ఎంతో కొంత నష్టం వాటిల్లే అవకాశాలే ఎక్కువ కనుక షరా మామూలుగానే కేంద్రం వివిధ పద్దుల క్రింద కొన్ని నిధుల విడుదల చేస్తుందేమో.