ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీలం సహాని హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. ఇలా వెళ్లడానికి రాజకీయం కారణం కాదు.. పూర్తిగా వ్యక్తిగతమే. ఢిల్లీలో నివసిస్తున్న ఆమె తల్లి.. సోమవారం మృతిచెందారు. దీంతో ఆమె నిన్ననే.. ఢిల్లీకి వెళ్లారు. అయితే… ఈ రోజు రాజధాని విషయంలో ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ సమావేశం జరగాల్సి ఉంది. ఈ హైపవర్ కమిటీకి నీలం సాహ్ని కన్వీనర్‌గా ఉన్నారు. ఉంటే.. మొత్తం వ్యవహారాలను.. ఆమె దగ్గరుండి చూసుకోవాలి. అందరికీ ఎజెండా గురించి వివరించాలి. అందరి అభిప్రాయాలు, నివేదికలను తీసుకోవాలి. టోటల్‌గా బాధ్యత అంతా ఆమెదే . కానీ ఇప్పుడు ఆమె అందుబాటులో లేరు. తల్లి మరణంతో తీరని దు:ఖంలో ఉన్న ఆమె.. హైపవర్ కమిటీ భేటీకి అందుబాటులో ఉండే అవకాశం లేదు.
ఇప్పటికే హైపవర్ కమిటీ భేటీ ఒక రోజు వాయిదా పడింది. మామూలుగా ఆరో తేదీన ఈ భేటీ జరపాలనుకున్నారు. వారం రోజుల ముందుగా… తేదీని డిసైడ్ చేసినప్పటికీ.. చాలా మంది మంత్రులు… ఆ రోజు వైకుంఠ ఏకాదళి అని… స్వామి వారిని ఉత్తరద్వార దర్శనం చేసుకోవాల్సిదేనని చెప్పడంతో.. ఏడో తేదీకి వాయిదా వేశారు. అనూహ్యంగా.. సీఎస్‌కు మాతృవియోగం కలిగింది. ఈ హైపవర్ కమిటీ.. పని ప్రధానంగా.. జీఎన్ రావు కమిటీ రిపోర్ట్‌తో పాటు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికలను పరిశీలించడం. రెండింటి సారాన్ని విశ్లేషించుకుని… తుది సిఫార్సులు చేయడం. ప్రభుత్వ పరంగా.. కమిటీ సారధ్య బాధ్యతలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చూసుకుంటున్నారు. ఇందులో మంత్రులు పిల్లి సుభాష్, బొత్స , మేకపాటి , ఆదిమూలపు , మేకతోటి సుచరిత, కన్నబాబు, మోపిదేవి, కొడాలి నాని, పేర్ని నానిలతో పాటు ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు కల్లాం అజేయరెడ్డి, డీజీపీ గౌతం సవాంగ్, భూముల శాఖ , మున్సిపల్ శాఖ , న్యాయశాఖ కార్యదర్శలు ఇందులో సభ్యులుగా ఉన్నారు.
అయితే.. ఇరవయ్యో తేదీలోపు.. నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఈ కమిటీకి సూచించింది. ఆ రోజున.. ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించి.. రాజధానిని విశాఖ తరలించాలని నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వం పట్టుదలతో ఉంది కాబట్టి… నీలం సాహ్నికి మాతృవియోగం జరిగినా.. ఆమె సమావేశాలకు కన్వీనర్ గా వ్యవహరించకపోయినా… కమిటీ భేటీలు ఆగవని… కమిటీల్లో ఎవరు వచ్చినా…రాకపోయినా.. పనులు జరుగిపోతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.