ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుల చట్టబద్ధతను తేలుస్తామని హైకోర్టు ప్రకటించింది. ఈ మేరకు సీరియస్ కామెంట్స్ చేసింది. శాఖలకూ సలహాదారులా అని ఆశ్చర్యపోయింది. నిజానికి హైకోర్టుకు పూర్తి వాస్తవ పరిస్థితి ఇంకా తెలియలేదని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతోంది ప్రజలు ఎన్నుకున్న వారు కాదు.. సలహాదారులే. ఇప్పుడు ఏ ప్రభుత్వ శాఖలో అయినా నిర్ణయం ఎవరు తీసుకుంటారు ? మంత్రులా ? అసలు మంత్రులకు తమకు ఏ శాఖ ఇచ్చారన్నది కూడా తెలియదు. వారు ఇంటింటికి వెళ్లే పనుల్లో ఉన్నారు. ఇక్కడ వారి పనిని చేసేది సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి.
ఆ మాటకొస్తే ముఖ్యమంత్రి పని చేసేది కూడా సజ్జలే. పోలీసులు ఆయన చెప్పినట్లే వింటారు. పోలీసులు మొత్తం ఆయన గుప్పిట్లో ఉంటారనేది బహిరంగరహస్యం. ఇక సచివాలయంలో ప్రతీ శాఖకు ఉన్నతాధికారులు ఉంటారు. వారు చేసేదేమీ ఉండదు. చేసేదంతా ఈ సకల శాఖ మంత్రి అయిన ముఖ్య సలహాదారు నియమించిన సలహాదారులే. వారే అన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సంతకాలు పెట్టేది మాత్రం ఆ సీనియర్ అధికతారులు. ఇప్పటికీ వారానికో సలహాదారును నియమిస్తూనే ఉంటారు. ఒక్కొక్కరికి రూ. నాలుగైదు లక్షల ప్రజాధనం ఇస్తూంటారు.
సలహాదారులు చట్ట వ్యతిరేకం. సలహాలివ్వడానికి ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని ప్రభుత్వాలు సీఎం లేదా మంత్రులకు నియమించుకోవచ్చు. ఎదుకంటే మంత్రులకు అన్నింటిపై అవగాహన ఉండకపోవచ్చు. కానీ శాఖలకూ నియమిస్తున్నారు. అది విచ్చలవిడితనంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఈ అంశం హైకోర్టు వద్దకు చేరింది. సీరియస్ గా కామెంట్స్ చేసింది. అంతే సీరియస్గా విచారణ కూడా కొనసాగిస్తే ప్రజలకు ఓ క్లారిటీ వస్తుంది.