ఆంధ్రప్రదేశ్ సీఐడీ.. అధికార పార్టీ కోసం బరితెగించి ప్రజల్ని వేధిస్తోందని.. అధికార పార్టీ నేతల కోసం.. ఎవరిని పడితే వారిని అపహరించడం… తప్పుడు కేసులతో వేధించడం చేస్తోందని కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇప్పుడు న్యాయస్థానాలు కూడా అదే చెబుతున్నాయి. ఓ వెబ్సైట్, యూట్యూబ్ చానల్ నిర్వాహికుడిపై పెట్టిన కేసులో ఎంత డొల్ల తనం ఉందో.. హైకోర్టు స్పష్టంగా చెప్పడమే కాదు.. ఖాకీస్వామ్యంతో అరాచకం తెస్తున్నారని నేరుగానే ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీల నేతల కోసం.. చట్టాలను ఉల్లంఘించడం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది.
ఈ ఒక్క కేసులోనే కాదు.. ఏపీ సీఐడీ వ్యవహారశైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. అధికార పార్టీకి ప్రైవేటు సైన్యంలా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం సోషల్ మీడియా పోస్టులు పెట్టారన్న కారణంగా… కొన్ని వందల మందికి నోటీసులు జారీ చేశారు. పెద్ద ఎత్తున యువకుల్ని.. వృద్ధుల్ని కూడా అరెస్ట్ చేశారు. చివరికి.. ఓ వ్యక్తిని విశాఖ నుంచి కర్నూలు తీసుకెళ్లి కరోనా రావడానికి కారణమయ్యారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. నలంద కిషోర్ అనే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు కూడా. ఇక ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టారని అక్రమంగా అదుపులోకి తీసుకుని అనేక మంది యువకులపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అలాంటి బాధితులు వందల్లోనే ఉన్నారు.
ఇప్పటికే ఏదైనా అధికార పార్టీకి కష్టం వస్తే.. ఏదో ఓ కేసు పెట్టేసి.. వారిని అదుపులోకి తీసుకోవడం సీఐడీకి అలవాటుగా మారిపోయింది. అయితే.. ఇలాంటి కేసుల్లో అనేకం.. కోర్టుల ముందు నిలవడం లేదు. అలా నిలవకపోయినా సీఐడీ అధికారులకు ఇబ్బందిలేనట్లుగా ఉంది. ఎందుకంటే.. వారి లక్ష్యం అప్పటికప్పుడు… వారి టార్గెట్ను అదుపులోకి తీసుకోవడం.. అరెస్ట్ చేయడం… వారికి సంబంధించిన వ్యాపారాలు లేదా.. మరొకటి ధ్వంసం చేయడం. కానీ.. ఇలా చేయడం తప్పు అని న్యాయస్థానాలు చెబుతున్నాయి. అలాంటప్పుడు… ఖచ్చితంగా చట్టాన్ని ఉల్లంఘించిన ఏపీసీఐడీ అధికారులు కూడా తప్పు చేసినట్లే అవుతుంది. వారిపై ఎవరైనా కోర్టుకు వెళ్తే.. పరిస్థితులు మారిపోయే అవకాశం ఉంది. చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎప్పటికైనా శిక్షార్హులేనని.. భారత రాజ్యాంగం చెబుతోంది.