ఏపీ సీఐడీ డీఎస్పీ దిలీప్ కుమార్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు యాభై ఏళ్లు మాత్రమే. ఎస్ఐగా విధుల్లో చేరి డీఎస్పీగా ఎదిగారు. అయితే ఆయన వైసీపీ ప్రభుత్వంలో సీఐడీలో పని చేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ పరమైన కేసులన్నీ ఆయన చేతుల మీదుగానే నడుస్తున్నాయి. రఘురామకృష్ణరాజు సహా రాజధాని కేసులు.. టీడీపీ నేతలపై పెట్టిన సీఐడీ కేసుల్లో ఆయనే కీలకంగా ఉన్నారు. సీఐడీ చీఫ్గా ఉన్న సునీల్ కుమార్ ఆదేశాల ప్రకారం ఆయన పని చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ కేసుల విషయంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.
తాజాగా అమరావతిలో.. సీఐడీ చేపట్టిన అసైన్డ్ ల్యాండ్ స్కాంకు సంబంధించిన రిపోర్ట్ రెడీ అయినట్లుగా తెలుస్తోంది. భూసమీకరణలో ఇచ్చిన అసైన్డ్ ల్యాండ్స్ పెద్దగా చేతులు మారలేదని సీఐడీ దర్యాప్తులో వెల్లడయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ నివేదిక రేపో మాపో సీఐడీ .. ప్రభుత్వానికి అందిస్తుందని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన మరణం .. చాలా మందిని షాక్కు గురి చేసింది. దిలీప్ కుమార్ నేతృత్వంలో విచారణ జరిగిన కేసుల్లో తాము ఎంత ఇబ్బంది పడ్డామో.. ఎలాంటిఆధారాలు లేకపోయినా తమను కేసులు పెట్టి టార్చర్ చేశారని.. టీడీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఇదంతా పై స్థాయి ఒత్తిడి వల్లేనని.. ఆయనపై తీవ్రమైన ఒత్తిడి పెట్టడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని వారు ఆరోపిస్తున్నారు.
దిలీప్ కుమార్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గతంలో దిలీప్ కుమార్ మంగళగిరి రూరల్, తాడేపల్లి,నకరికల్లు, ఎస్ఐ గా బాధ్యతలు నిర్వహించారు. ఇంట్లో ఉన్న సమయంలో గుండెపోటుకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటీన గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసు శాఖో దిలీప్ కుమార్ మృతి చర్చనీయాంశం అవుతోంది.