ఏపీ సీఐడీ చీఫ్ గా పని చేసిన సునీల్ కుమార్ ను బదిలీ చేశారు. ఆయన స్థానంలో సీఐడీ చీఫ్ గా సీనియర్ ఐపీఎస్ సంజయ్ ను నియమించారు. అయితే సీఐడీ పోలీసులు పూర్తిగా దారి తప్పారని… గుర్తించినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలు కోరుకున్నట్లుగా రాజకీయ కేసులతో టీడీపీ నేతల్ని ఇబ్బంది పెడుతున్నాం కాబట్టి.. తాము ఏమైనా చేయవచ్చంటూ.. కొంత మంది పోలీసులు ప్రైవేటు సైన్యంగా మారి సెటిల్మెంట్లు చేసినట్లుగా గుర్తించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అనేక దందాలపై ఫిర్యాదులు రావడంతో కొత్త సీఐడీ చీఫ్.. మొత్తం విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
చాలా పిర్యాదులు అత్యంత తీవ్రమైనవి. ప్రకాశం జిల్లాలో అ అధికార పార్టీ నేతను బెదిరించి ఆస్తులు రాయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అవి సీఎం దగ్గరకు వెళ్లాయని తెలుస్తోంది. ఇక సునీల్ కుమార్ ను బదిలీ చేసినప్పుడు.. విశాఖలో సీఐడీ అధికారులు వేలు పెట్టిన ఓ దందా హైలెట్ అయింది. ఇలాంటివి చాలా ఉన్నాయని చెబుతున్నారు. ప్రభుత్వపెద్దలు తమ రాజకీయ అవసరాల కోసం సీఐడీని వాడుకుంటే.. ఇదే అదనుగా వారు సొంత వ్యవహరాలు సీఐడీని అడ్డం పెట్టుకుని చేయడంతో మొత్తం తేడా వచ్చింది.
ఇప్పుడు కొత్త చీఫ్ సీఐడీని గాడిన పెట్టేందుకు దందాల్లో మునిగి తేలుతున్న వారిపై వేటు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. డిప్యూటేషన్లపై వచ్చిన వారిని మాతృసంస్థలకు బదిలీ చేయడం… ప్రాధాన్యత లేని పోస్టులు ఇవ్వడం వంటివి చేస్తున్నారు. రిటైరైన సరే… సీఐడీలోనే మకాం వేసి.. చేయాల్సినదంతా చేస్తున్న ఓ అధికారికిని కూడా ఇంటికి పంపినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా ప్రభుత్వం కోరుకున్నట్లుగా పని చేయడం ఆపకపోయినా… అదే అదనుగా… ప్రజల్ని పీడించే వ్యవహారాలకు మాత్రం చెక్ పెట్టాలనే ప్రయత్నం కొత్త చీఫ్ చేస్తున్నారు. కానీ ఇప్పటికే సమయం మించిపోయింది.. సీఐడీ అంటే ప్రజల్లో ఓ అభిప్రాయం స్థిరపడిపోయింది.