ప్రతీ క్రియకి ప్రతిక్రియ ఉంటుందని న్యూటన్ మహాశయుడు ఎప్పుడో చెప్పాడు. ఆ సిద్దాంతానికి రాజకీయాలు కూడా అతీతం కాదని నిరూపిస్తూ అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ముద్రగడ పద్మనాభం వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, అలాగే తుని విద్వంసం వెనుక వైకాపా నేతలున్నారని తెదేపా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. వారిద్దరూ ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై నిత్యం విమర్శలు కురిపిస్తున్నారు. వారిలో జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్రల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల చాలా అనుచితంగా మాట్లాడగా, ఆగస్ట్ నెలాఖరులోగా కాపులకు రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రకటన చేయకపోయినట్లయితే, తాను మళ్ళీ ఉద్యమానికి సిద్దం అవుతానని ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. వారిరువురి తీరుపట్ల తెదేపా నేతలు అందరూ చాలా ఆగ్రహంగా ఉన్నారు.
తిరుపతికి చెందిన వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి, తుని విద్వంసానికి ముందు ముద్రగడని కలిసారని, ఆయనతో ఫోన్ లో మాట్లాడినట్లు తుని సెల్ టవర్ నుంచి వెళ్ళిన కాల్స్ డాటా ఆధారంగా పోలీసులు గుర్తించారు. కరుణాకర్ రెడ్డి కూడా తాను ముద్రగడని కలిసిన మాట వాస్తవమే కానీ తెదేపా నేతలు ఆరోపిస్తున్నట్లుగా తుని విద్వంసానికి మూడు రోజుల ముందు కాకుండా మూడు నెలల ముందు కలిసినట్లుగా చెప్పారు. ముద్రగడతో ఆయనకి పరిచయాలు ఉండటం నేరం, విశేషమేమీ కాకపోయినా, ఆయనను, వైకాపాని ఇబ్బంది పెట్టేందుకు ఆ మాత్రం లింక్ సరిపోతుంది.
ఆ విద్వంసంపై గత 4నెలలుగా సి.ఐ.డి.పోలీసులు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇంతవరకు కడప జిల్లా నుంచి 10 మందిని, గుంటూరు జిల్లాకి చెందిన 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం దూడల ఫణి అనే రౌడి షీటర్ ని అదుపులోకి తీసుకొన్నారు. వైకాపా నేతలతో అతనికి ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఒకవేళ అతను ఎవరైనా వైకాపా నేతల పేర్లు చెప్పినట్లయితే, ఇక దర్యాప్తు వేగవంతం అవవచ్చు.