మార్గదర్శి ఆఫీసులను పదే పదే సోదాలు చేసి… ముందే రాసి పెట్టుకున్న ఆరోపణలు చేయడానికి సీఐడీ పోలీసులు మళ్లీ రెడీ అయ్యారు. కోర్టు గతంలో ఎన్ని ఆదేశాలు ఇచ్చినా వాటిని పక్కన పెట్టి మళ్లీ కొత్తగా బ్రేక్ త్రూ అంటూ… ఆదివారం పూట.. మీడియాకు విందు ఏర్పాటు చేసి మరీ కొత్త ఆరోపణలు చేయడానికి రెడీ అయిపోయారు.
మార్గదర్శి దగ్గర డబ్బుల్లేవని ఖాతాదారులకు ఇవ్వట్లేదని రెండు రోజులుగా సాక్షి పత్రిక రాస్తోంది. బహుశా అదే ఆరోపణలు చేయడానికి పోలీసులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఉంటారని చెబుతున్నారు. ఇక అగ్నిమాపక శాఖ అధికారులతోనూ సోదాలు నిర్వహించారు. అయితే మార్గదర్శి శాఖలన్నీ అద్దె భవనాల్లోనే ఉంటాయి. మూసేస్తే భవనం మొత్తాన్ని మూసేయాలి. పగతో రగిలిపోతున్న వారికి అది పెద్ద విషయం కాదు.
మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ . అంటే డిపాజిట్లు తీసుకోలేరు. ఇరవై మంది సభ్యులు ఉంటే… అందరి దగ్గర వసూలు చేసి ఒకరికి ఇస్తారు. అదే చిట్ గ్రూప్. అంటే సొమ్ములు చిట్ గ్రూపు సభ్యుల వద్దనే ఉంటాయి కానీ.. సంస్థ వద్ద ఉండవు. ఈ చిన్న లాజిక్ చిట్స్ గురించి తెలిసిన వారందరికీ తెలుసు. మార్గదర్శితో డీల్ చేసే వారందరికీ తెలుసు. అందుకే పోలీసుల వాదనను ఎవరూ వినడం లేదు.
కానీ సీఐడీ మాత్రం.. పాలకుల క్రిమినల్ మైండ్ కు అనుగుణంగా ప్రవర్తించేందుకు రెడీ అయ్యారు. ఓ వ్యాపార సంస్థపై ఇలా దాడి చేస్తున్నారు.. అంటే…. వ్యవస్థలన్నీ ఘోరంగా విఫలమైనట్లే. అధికారం ఉంటే.. మనుషుల్ని చంపడానికి కూడా లైసెన్స్ ఉన్నట్లుగా భావించే పరిస్థితి ఇది తీసుకొస్తోంది. ఇప్పుడు వ్యాపార సంస్థను పట్టపగలు హత్య చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమే ఇది.