తెలంగాణా ప్రభుత్వం, దాని ముఖ్యమంత్రి కెసిఆర్, తెరాస గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, చాలా రోజుల తరువాత వారి గురించి నిన్న మాట్లాడారు. తెలంగాణా తెదేపా నేతలతో సమావేశమయినప్పుడు తెలంగాణాలో ఏవిధంగా ముందుకు సాగాలనే దానిపై ఆయన వారికి కొన్నిసూచనలు చేశారు.
“తెలంగాణా ప్రభుత్వం నేటికీ నామీద నిందలు వేస్తూ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తోంది. ఏదో ఒక సమస్యని చూపి నన్ను దోషిగా చూపిస్తూ రాష్ట్ర ప్రజలను రెచ్చగొడితేనే ప్రజలపై తన పట్టు నిలుపుకోవచ్చని తెరాస భావిస్తోంది. ఆ ప్రయత్నంలోనే తెలంగాణా ప్రాజెక్టులకి నేను అడ్డు తగులుతున్నానని నన్ను నిందిస్తోంది. కానీ నేను ఎప్పుడూ దేనినీ అడ్డుకొనే ప్రయత్నం చేయలేదు. తెలంగాణాలో ప్రాజెక్టులు, నదీ జలాల పంపకాలు విభజన చట్ట ప్రకారమే జరగాలని కోరుతున్నాను. చట్ట ప్రకారం ముందుకు వెళ్ళమని చెప్పడం తప్పు కాదు కదా? నాకు ఆంధ్రా ఎంతో తెలంగాణా కూడా అంతే. రెండు తెలుగు రాష్ట్రాలు సరిసమానంగా అభివృద్ధి చెందాలని కోరుకొంటాను. తెలంగాణా ప్రభుత్వానికి ప్రాజెక్టుల విషయంలో స్పష్టత లేకపోవడంతో విమర్శలు ఎదుర్కొంటోంది. వాటి నుంచి తప్పించుకోవడానికే నాపై విమర్శలు గుప్పిస్తూ ప్రజలని మభ్యపెడుతోంది. ఇదే విషయాన్ని మీరు ప్రజలకు చెప్పవలసి ఉంది,” అని తెలంగాణా తెదేపా నేతలకి బాబు చెప్పారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణా రాష్ట్రం, రాష్ట్ర రాజకీయాలపై పూర్తి పట్టు సాధించారు. ప్రతిపక్షాలన్నిటినీ నిర్వీర్యం చేసి రాష్ట్రంలో తెరాసకి ఎదురేలేకుండా చేసుకొన్నారు. ప్రతిపక్షాలలో మిగిలిన కొద్ది మంది నేతలు ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేస్తున్నా వాటిని ఆయన పట్టించుకోకుండా తనకు నచ్చినట్లుగానే నిర్ణయాలు తీసుకొంటూ పరిపాలన సాగిస్తున్నారు. అయినప్పటికీ, అవకాశం చిక్కినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శిస్తూనే ఉంటారు.
ఎవరూ తమ ప్రాజెక్టులని ఆపలేరని అంటారు మళ్ళీ అంతలోనే చంద్రబాబు అడ్డుపడుతున్నారని ఆరోపిస్తుంటారు. తెలంగాణాలో తెరాసకి సవాలు విసురుతున్న తెదేపాని దాదాపు తుడిచిపెట్టేసిన తరువాత కూడా ఇంకా చంద్రబాబు నాయుడుని విమర్శిస్తుండటం గమనిస్తే ఇంకా కెసిఆర్ అభద్రతాభావంతో బాధపడుతున్నట్లే ఉన్నట్లు అర్ధం అవుతోంది. తెలంగాణా ప్రాజెక్టులని చంద్రబాబు నాయుడు అడ్డుకోలేరని కెసిఆర్ నమ్ముతున్నప్పుడు ఆయనపై విమర్శలు ఎందుకు గుప్పిస్తున్నారు? అంటే చంద్రబాబు చెప్పిన కారణమే.
రాష్ట్ర విభజన తరువాత కెసిఆర్ కి వడ్డించిన విస్తరి వంటి తెలంగాణా రాష్ట్రం దక్కితే, చంద్రబాబుకి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేపట్టారు. కనుక చంద్రబాబే అటువంటి అభద్రతాభావంతో బాధపడుతూ ఉండాలి. కానీ ఎన్ని సమస్యలున్నా ఆయన చాలా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతుంటే, అన్నీ ఉన్న కెసిఆర్ మాత్రం ఇంకా అభద్రతాభావంతో బాధపడుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.