గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్ లో నిన్న సాయంత్రం ఇచ్చిన ఇఫ్తార్ విందుకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కాలేదు కానీ తన మంత్రులను పంపించారు. తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్, ఆయన మంత్రులు హాజరయ్యారు. మంత్రివర్గ సమావేశం, తదితర కార్యక్రమాలతో తీరికలేనందునే చంద్రబాబు రాలేకపోయారని అందరూ సర్ది చెప్పుకొన్నారు. కానీ కెసిఆర్ ని కలవడానికి ఇష్టపడకనే ఆ సమావేశానికి చంద్రబాబు హాజరుకాకపోయి ఉండవచ్చని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఒకప్పుడు తెలంగాణా ప్రభుత్వంతో, దాని ముఖ్యమంత్రి కెసిఆర్ తో సఖ్యతగా ఉంటూ, సమస్యలని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించేవారు. అదేవిధంగా మాట్లాడేవారు. కానీ తెలంగాణా ప్రాజెక్టులని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి కర్నూలులో దీక్ష చేసి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణా ప్రభుత్వానికి తాకట్టు పెడుతున్నారని విమర్శలు గుప్పించినప్పటి నుంచి, ఆయనలో క్రమంగా మార్పు రావడం కనిపిస్తోంది.
రాజోలి బండ వివాదం గురించి చర్చించుకొందామని తెలంగాణా మంత్రి హరీష్ రావు ఆంధ్రా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకి ఫోన్ చేసి ఆహ్వానించినప్పుడు రామని నిర్మోహమాటంగా చెప్పేశారు. కేంద్రం సమక్షంలో మాత్రమే మాట్లాడుకొందామని చెప్పడమే కాకుండా తన పంతం నెగ్గించుకొన్నారు. మంత్రి దేవినేని ముఖ్యమంత్రి వైఖరికి అనుగుణంగానే మాట్లాడారని వేరే చెప్పనవసరం లేదు. షెడ్యూల్ 10 క్రిందకు వచ్చే సంస్థలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖలు వ్రాయడం కూడా అదే సూచిస్తోంది. కనుక తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ని కలవడం ఇష్టం లేకనే చంద్రబాబు నాయుడు గవర్నర్ ఇచ్చిన విందు సమావేశానికి హాజరుకాకపోయి ఉండవచ్చు.
ఇంతకీ చంద్రబాబు వైఖరిలో ఈ మార్పుకి కారణం ఏమిటి? అని ప్రశ్నించుకొంటే జగన్ చేసిన ఆరోపనలేనని భావించాల్సి ఉంటుంది. ఓటుకి నోటు కేసు భయంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కెసిఆర్ కి దాసోహం అయిపోయారని, ఆ భయంతోనే రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణాకి తాకట్టుపెట్టేస్తున్నారని జగన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అది తప్పు. అబద్ధం అని రుజువు చేసేందుకే చంద్రబాబు నాయుడు తెలంగాణా ప్రభుత్వం పట్ల మళ్ళీ కటిన వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు భావించవచ్చు. కానీ జగన్ లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి ప్రయత్నించకుండా పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం వలన రాష్ట్రానికి ఏమీ ప్రయోజనం ఉండదు. జరిగే నష్టం జరిగిపోతుంది.