గ్రేటర్ ఎన్నికల కోసం తెదేపా తరపున నారా లోకేష్ ఇప్పటికే చాలా జోరుగా ప్రచారం చేస్తున్నారు. జంట నగరాలలో ఆంధ్రాలో వివిధ జిల్లాల నుండి వచ్చి స్థిరపడిన ఓటర్లు ఎక్కువగా ఉన్నందున వారిని ఆకర్షించేందుకు ఆయా జిల్లాల నేతల చేతనే తెదేపా ప్రచారం నిర్వహిస్తూ వారిని ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తోంది. కుతుబుల్లాపూర్ లో నిన్న ఏపి పంచాయితీ రాజ్ శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటింటికీ తిరిగి పార్టీ తరపున ప్రచారం చేసారు. అలాగే శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉండే కూకట్ పల్లి పరిధిలో గల మూసాపేట, అల్లాపూర్ డివిజన్లలో మంత్రులు ప్రతిప్పాటి పుల్లారావు, అచ్చెం నాయుడు, ఉమా మహేశ్వర రావు, అయ్యన్న, ఎంపి కింజారపు రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుతుబుల్లాపూర్ లో ఎన్నికల ప్రచారం చేస్తారు. వీరు కాక తెలంగాణా తెదేపా శాసనసభ్యులు, నేతలు కూడా చాలా ఉదృతంగా ప్రచారం చేస్తున్నారు.
జంట నగరాలలో స్థిరపడిన ఆంద్ర ప్రజలని ప్రసన్నం చేసుకోవాలని మంత్రి కె.టి.ఆర్. ఎంతగా ప్రయత్నిస్తున్నారు. కానీ సహజంగానే వారిపై తమ స్వస్థలాలకు చెందిన ఆంధ్రా మంత్రుల, నేతల ప్రచార ప్రభావం ఎక్కువగా ఉండవచ్చును. గ్రేటర్ పరిధిలో ఆంద్ర ప్రజలు ఎవరివైపు మొగ్గితే వారికే విజయావకాశాలు పెరుగుతాయి. కానీ వారి ఓట్లు తెరాసకు పడతాయో లేదో అనేది తెలియదు కనుక గ్రేటర్ పరిధిలో ఆ పార్టీకి మంచి పట్టున్న ప్రాంతాలలో తెరాస నేతలు గట్టిగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ, మజ్లీస్, కాంగ్రెస్ పార్టీలకీ గ్రేటర్ పరిధిలో వాటి ఓటు బ్యాంక్ వాటికుంది. కనుక ఈ పార్టీలన్నిటిని ఒంటరిగా డ్డీ కొంటున్న తెరాస వాటి ఓటు బ్యాంకులను ఏ మేరకు కొల్లగొట్టగలదనే దానిపైనే దాని విజయం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అన్ని పార్టీలు తమ ఓటు బ్యాంకులను పదిలంగా కాపాడుకోగలిగితే, తెరాస చెప్పుకొంటున్నట్లుగా కనీసం 80 సీట్లు రావడం కూడా కష్టమే అవుతుంది.