40 ఏళ్ల రాజకీయ జీవితం.. అడుగడుగునా ఎన్నో ఒడిదొడుకులు. ఎప్పటికప్పుడు ఎన్నో సవాళ్లూ సంక్షోభాలు. అలాంటి సమయాల్లో కూడా ధైర్యంగా నిలబడి, అవకాశాలను వెతుక్కుంటూ సవాళ్లను అధిగమించుకుంటూ సాగుతూ వస్తోంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం.
1978.. చంద్రగిరి నియోజక వర్గం నుంచి ఆయన తొలిసారిగా శాసనసభ్యుడిగా పోటీకి దిగారు. ఇందిరా కాంగ్రెస్ ఏర్పడ్డాక, ఆ పార్టీ తరఫున నామినేషన్ వేశారు. అక్కడే తొలి సవాలు. అంతవరకూ ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. అప్పటికి రెండేళ్ల ముందు నుంచే ప్రజల్లో తిరిగారు. అందరూ ఓటేస్తామనేవారే తప్ప.. నిజంగా వారిలో ఆదరించేవారు ఎంతమందో అంచనా లేదు. కానీ, సరిగ్గా ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున… మిగతా నేతలంతా కంగారుగా ఉంటే, చంద్రబాబు మాత్రం ఓటర్లు జాబితా తెప్పించుకున్నారు. తనకు పడిన ఓట్ల సంఖ్యను అంచనాగా లెక్కించారు. కాసేపటికి ఆయనకి క్లారిటీ వచ్చేసింది. మనం గెలుస్తున్నాం అని ధీమాగా చెప్పేశారు! ఫలితం రాకముందే అంత నమ్మకం ఏంటీయనకి అన్నట్టుగా అందరూ చూశారు. కానీ, ఆయన చెప్పిందే ఫలితాల్లో కూడా ప్రతిఫలించింది. చంద్రబాబు విజన్ కు తొలి విజయం అది. 1980లో అంజయ్య క్యాబినెట్ లో మంత్రి అయ్యారు. ఇది ఆయన రాజకీయ జీవితంలో తొలిదశ.
ఇక, రెండో దశ అంటే.. ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన దగ్గర్నుంచీ మొదలైంది. చిన్నవయసులోనే మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ చిత్తూరు జిల్లాకు నాయకుడిగా ఎదిగారాయన. ఆ తరువాత, జల్లా పరిషత్ ఛైర్మన్ గా కూతూహలమ్మను గెలిపించుకోవడం కోసం సొంత పార్టీ నేతలతోనే ఘర్షణ పడ్డారు. ఆ సందర్భంగా సస్పెండ్ అయ్యారు కూడా! దాంతో మంత్రి చంద్రబాబుపై పార్టీ సస్పెన్షన్ అనేది అప్పట్లో సంచనలమైంది. కానీ, ఆయన వెనక్కి తగ్గలేదు. చివరికి హై కమాండ్ వెనక్కి తగ్గి… మంత్రి పదవిని కొనసాగించాల్సి వచ్చింది. తరువాత, ఆయన టీడీపీ వ్యవస్థాపకుడు, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకోవడంతో.. ఆయన రాజకీయ ప్రస్థానంలో మరో మలుపు తిరిగింది. అక్కడి నుంచి దాదాపు 1995 వరకూ మరో దశ.
ఆ తరువాత, ఎన్టీఆర్ మీద తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది! అదే సమయంలో ఎన్టీఆర్ మరణించారు. దీంతో తన రాజకీయ జీవితంలోనే పెద్ద సవాలును ఎదుర్కోవాల్సిన సమయం అది. ఎన్టీఆర్ మహానేత, మహా నటుడు, ఆయనకున్న మహా క్రేజ్.. వీటికి ఎదురు నిలవడమంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. పైగా, ఇదే సమయంలో విపక్షాలు చంద్రబాబుపై ప్రజల్లోకి వెళ్లి పెద్ద ఎత్తున చేసిన దుష్ప్రచారం తట్టుకోవడం మరో సవాల్. ఏకంగా తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో పడిపోయిన సందర్భం అది. ఆ సమయంలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి… ఆ తరువాత ప్రజల ఆమోదం పొందడం అనేది అసాధారణమైన విషయం.
ఆ తరువాత, ఎదుర్కొన్న మరో సవాల్.. తెలుగుదేశం పార్టీని నడపడటం! ఎన్టీఆర్ కు అంత క్రేజ్ ఉంది కాబట్టి పార్టీ నడిచిందిగానీ, ఏ గ్లామరూ లేని చంద్రబాబు వల్ల సాధ్యమయ్యే పని కాదనీ, ఆర్నెల్లలో మూసేస్తారని చాలామంది అనేవారు. అయినాసరే, తనకంటూ ఒక పద్ధతినీ, పంథాను సృష్టించుకుని, తనదైన శైలిలో పార్టీని సక్సెస్ ఫుల్ గా నడిపించుకుంటూ వచ్చారు. 1999లో తనదైన సొంత ముద్రతో తెలుగుదేశం పార్టీకి ప్రజల నుంచీ పరిపూర్ణ ఆదరణ లభించేలా కృషి చేశారు. ఆ తరువాత, అలిపిరి ఘటన… ఆయన జీవితంలో అత్యంత మరో కీలకమైన మలుపు. 2004 నుంచి ఆయన వరుసగా పదేళ్లపాటు ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు. వైయస్సార్ ముఖ్యమంత్రి అయిన తరువాత వరుసగా రెండు సార్లు ఓటమి. పదేళ్లపాటు ఒక ప్రాంతీయ పార్టీని నిలబెట్టుకోవడం మరో సవాల్ గా మారింది. తెలుగుదేశం పార్టీ దాదాపు నీరసించిపోయే పరిస్థితి వచ్చిందని చాలామంది అనుకున్నారు. సరిగ్గా అలాంటి సమయంలో రాష్ట్ర విభజన జరిగింది. అప్పటికే వైయస్సార్ మరణం.. వైకాపా ఆవిర్భావం జరిగిపోయాయి.
2014 ఎన్నికలు… తండ్రి వైయస్సార్ చేతిలో వరుసగా రెండుసార్లు ఓటమిని చవి చూసిన చంద్రబాబు, ఇప్పుడు వైయస్సార్ కుమారుడు జగన్ చేతిలో ఓడిపోబోతున్నారనే అంచనాలే బాగా చక్కర్లు కొట్టాయి. విభజిత ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ గెలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ, సరిగ్గా ఇక్కడే… విభజన తరువాత ఆంధ్రుల ఆలోచన ధోరణి మరోలా ఉందని తేలింది. నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని ప్రజలు గెలిపించారు. దీనికి ఒకేఒక్క కారణం… అవిభక్త ఆంధ్రప్రదేశంలో ఆయన హాయంలో జరిగిన అభివృద్ధి. సంక్షోభంలో ఉన్న రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది చంద్రబాబుకు మాత్రమే సాధ్యమయ్యే పని అని ప్రజలు నమ్మారు.
నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచీ అన్నీ సవాళ్లే. రాజధాని లేదు, ముఖ్యమంత్రి కార్యాలయం లేదు, నిధుల్లేవు, ఆదాయం లేదు! పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ఉండే అవకాశం ఉన్నా… అవన్నీ కాదనుకుని, విజయవాడలో ఒక బస్సులో బస ఏర్పాటు చేసుకుని పనిచేయడం మొదలుపెట్టారు. ఒక్కోటిగా సౌకర్యాలను ఏర్పాటు చేశారు. తాత్కాలిక సచివాలయం నిర్మించారు. అన్ని ప్రభుత్వ శాఖల్ని అనుకున్న సమయం కంటే ముందుగా అమరావతికి తలరించారు. అన్నిటికీ మించి ఆంధ్రుల్లో ఏరకంగానూ వెనుకబాటు భావనను రాకుండా రాష్ట్రాన్ని తనదైన విజన్ తో నడిపిస్తున్నారనడంలో సందేహం లేదు. ఇప్పుడు, రాష్ట్ర ప్రయోజనాల నేపథ్యంలో మిత్రపక్షమైన భాజపాతోనే పోరాటం సాగించే క్రమంలో ఉన్నారు.
నలభయ్యేళ్ల ప్రస్థానంలో అడుగడుగునా సంక్షోభంతో సమానమైన సవాళ్లే చంద్రబాబు నాయుడుకు ఎదురౌతూ వస్తున్నాయి. కానీ, ఆయా సందర్భాలను ధైర్యంగా నిలబడుతూ, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకగా పుట్టిన తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రాకు ప్రపంచస్థాయి గుర్తింపు తేవడంలో చంద్రబాబు కృషిని ఎవ్వరూ కాదనలేని పరిస్థితి. ఇప్పుడు నవ్యాంధ్రను జీరో నుంచి నిర్మించుకుంటూ మరోసారి అభివృద్ధిపథం వైపు నడిపించడం కూడా ఆయనకే సుసాధ్యమయ్యే సవాలు అనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు.