ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీలో వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన బుధవారం అంతా వరుసగా కీలక నేతలతో భేటీ అయ్యారు. మొదట వాజపేయి శతజయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. తర్వాత ఎన్డీఏ నేతల సమావేశంలో పాల్గొన్నారు. సాయంత్రం ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
పోలవరం, అమరావతి పురోగతిని మోదీకి చంద్రబాబు వివరించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రానికి ప్రకటించిన ప్రాజెక్టులను మరింత వేగంగా అమలు చేసేలా చూడాలని కోరారు. అలాగే ఫిబ్రవరి ఒకటోతేదీన కేంద్రం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్లో పొందుపరచాల్సిన సాయం గురించి కూడా చర్చించినట్లుగా చెబుతున్నారు. ఈ మేరకు వినతి పత్రాలు ఇచ్చారని అంటున్నారు. మోదీతో సమావేశం తర్వాత అమిత్ షాతోనూ సమావేశం అయ్యారు. అమిత్ షాతో రాజకీయ అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
చంద్రబాబు ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా జాతీయ మీడియా ఆసక్తి చూపిస్తుంది. జాతీయ నేతలు ఆయనను కలిసి మాట్లాడేందుకు ఆసక్తి చూపిస్తారు. బుధవారం క్రిస్మస్ అయినప్పటికీ ఆయన ఢిల్లీలో తీరిక లేని సమావేశాల్లో గడిపారు.