నంది అవార్డులు కొద్ది రోజులుగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. `నంది` వివాదంపై చంద్రబాబు ఎట్టకేలకు స్పందించారు.
అవార్డులపై ఇంత ఇంత రాద్ధాంతం చేస్తారని తాను ఊహించలేదనీ, ఇంత గొడవ జరుగుతుందనుకుంటే పారదర్శకంగా `ఐవీఆర్ఎస్` సర్వే చేయించి ప్రజాభిప్రాయం ప్రకారమే నంది అవార్డులను ప్రకటించేవాళ్లమని చంద్రబాబు అన్నారు. అవార్డులకు కూడా కులాన్ని ఆపాదించడం దురదృష్టకరమని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాల అవార్డులు ఒకేసారి ఇచ్చి ఉండాల్సింది కాదని అందువల్లే ఈ వివాదాలు ఏర్పడ్డాయని అభిప్రాయపడ్డారు.
అయితే సినీ అవార్డుల విషయమై సీఎం స్పందించేంత వరకు వెళ్ళడం ఆశ్చర్యకరం. సాధారణంగా ఏవైనా పొరపాట్లు జరిగితే జ్యూరీ దే బాధ్యత అవుతుంది కానీ ప్రభుత్వానిది కాదు. అయితే చంద్రబాబు స్పందించడానికి ప్రధాన కారణం బహుశా అవార్డుల వివాదం కాస్తా కులాల వివాదం గా మారడం అయి ఉండవచ్చు. ఈ కులాల కుంపటి మరింతగా రగలక ముందే దీనికి ఫుల్ స్టాప్ పెడితే మంచిదని ఆయన భావించి ఉండవచ్చు. జనరల్ గా టాప్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళకి క్రింది స్థాయి లో పబ్లిక్ పల్స్ పెద్దగా తెలియదు. అందుకే ఒక్కోసారి స్పందించాల్సిన విషయాలకి కూడా స్పందించకుండా ఉండిపోయి తర్వాత మూల్యం చెల్లించుకుంటూ ఉంటారు. కానీ నిజంగా తాను స్పందించాల్సినంత విషయం కాకపోయినా, ఈ సమస్య గురించి ఆరా తీసి, తన ఆవేదన కూడా పబ్లిక్ కి తెలిసేలా చేసారు. రాష్ట్రం లో ప్రస్తుతం ఉన్న ఎన్నో సమస్యలతో పోలిస్తే నంది అవార్డుల విషయం చిన్నదే. కానీ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరగడం, ఇది కులాల వివాదం గా ప్రొజెక్ట్ అవడం తో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి స్పందించాల్సినంత పెద్ద విషయంగా పరిణమించింది.
మరి ఇకనైనా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా అనేది వేచి చూడాలి.