ఓటుకి నోటు కేసులో ఏసిబి అధికారులు కాస్త హడావుడి చేయగానే అవతల వైపు నుండి ఏపీ మంత్రులు కూడా కొంచెం హడావుడి చేయడం ఆనవాయితీగా మారిపోయిందిప్పుడు. ఏసిబి అధికారులు నారా లోకేష్ కారు డ్రైవర్ కొండల రెడ్డికి, మళ్ళీ నిన్న మాజీ ఎంపీ ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస నాయుడు మరో ఇద్దరికీ నోటీసులు అందజేసినట్లు వార్తలు రాగానే అవతలి నుండి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. కానీ ఆ కేసు గురించి మాట్లాడకుండా సెక్షన్: 8 అమలు గురించి మాట్లాడారు.
ఆయన నిన్న రాత్రి తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర విభజన జరిగి 15నెలలు అవుతున్నా సెక్షన్: 8ని అమలుచేయకుండా గవర్నర్ రాష్ట్ర ప్రజలను కించపరుస్తున్నారు. తెలంగాణా ప్రభుత్వం విభజన చట్టాన్ని యధేచ్చగా ఉల్లంఘిస్తూ ఇంటర్ మీడియేట్ బోర్డు బ్యాంక్ ఖాతాను స్తంభింపజేసింది. విద్యుత్ శాఖలో ఏకంగా ఒకేసారి 1250మంది ఉద్యోగులను విధులలో నుండి తప్పించింది. షెడ్యూల్ 9 మరియు 10 క్రింద వచ్చే అనేక సంస్థలను ఏకపక్షంగా స్వాధీనం చేసుకొంటోంది. ఈవిధంగా తెలంగాణా ప్రభుత్వం అనేక సమస్యలను సృష్టిస్తున్నా గవర్నర్ పట్టించుకోవడం లేదు. సెక్షన్: 8ని అమలుచేసి హైదరాబాద్ లో ఏపీ హక్కులను కాపాడాలని మేము చేస్తున్న విజ్ఞప్తులను కూడా ఆయన పట్టించుకోవడం లేదు. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఈ సమస్యల గురించి కూడా మాట్లాడి వాటిని పరిష్కరించామని గట్టిగా అడుగుతాను,” అని చంద్రబాబు నాయుడు తెలిపారు.
ఆయన చేస్తున్న ఈ ఆరోపణలన్నీ నిజమేనని అందరూ అంగీకరిస్తారు. కానీ వాటి గురించి ఆయన ఓటుకి నోటు కేసులో కదలిక వచ్చినప్పుడో లేకపోతే రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా విషయంలో తన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించినప్పుడో మాట్లాడుతుండటం వలననే అనుమానించవలసి వస్తోంది. ఆయన చెపుతున్న ఈ సమస్యలన్నీ రాష్ట్ర స్థాయిలో పరిష్కారం కావనే సంగతి స్పష్టమయినప్పుడు, ఇక కేంద్రం వద్దనే అమీ తుమీ తేల్చుకోవలసి ఉంటుంది. కానీ గట్టిగా ఆ ప్రయత్నం చేయకుండా, ఓటుకి నోటు కేసులో కదలిక వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడుతుంటే ఈ సమస్యల పరిష్కారం పట్ల ఆయనకు చిత్తశుద్ది ఉందా లేదా? అనే అనుమానం కలగడం సహజం. తెదేపా, తెరాస ప్రభుత్వాలు ఆడుకొంటున్న ఈ రాజకీయ చదరంగంలో ఉద్యోగులు పావులుగా మిగిలిపోతున్నారు. వారు, వారి కుటుంబాలు వీదినపడకుండా కాపాడవలసిన ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాలు ఇంతకాలం తమకు సేవ చేసిన వారిని పట్టించుకోకుండా ఓటుకి నోటు కేసులో ఎత్తులకి పైఎత్తులు వేసుకొంటూ కాలక్షేపం చేస్తున్నాయి.