ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూణేలోని ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంటు అనే ఒక రాజకీయేతర విద్యార్ధి సంస్థ నుండి ఈరోజు ఆదర్శ ముఖ్యమంత్రి అవార్డు అందుకొన్నారు. రాహుల్ కే. కరాడ్ అనే విద్యార్ధి 2011లో ఈ సంస్థను స్థాపించాడు. దాని ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే దేశంలో గల 400 విశ్వవిద్యాలయాలు, 25, 000కి పైగా కాలేజీలలోచదువుకొంటున్న విద్యార్ధులలో రాజకీయాలలో ప్రవేశించాలనే ఆసక్తి ఉన్నవారికి అందుకు తగిన శిక్షణ ఇవ్వడమే. తమ సంస్థ వార్షికోత్సవ సందర్భంగా ప్రతీ ఏటా ఈరోజున దేశంలో వివిధ రంగాలలో కృషి చేస్తున్న వారిని ఆహ్వానిస్తుంది. వారు విద్యార్ధులకు దిశానిర్దేశం చేస్తూ ఉపన్యాసాలు చేస్తారు. ఈసారి ఆ సంస్థ దేశంలో వివిధ ప్రముఖులతో బాటు చంద్రబాబు నాయుడుని కూడా ఘనంగా సన్మానించి ఆయనకి ఆదర్శ ముఖ్యమంత్రి అవార్డును అందజేసింది. ఈరోజు ఆయనతో బాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి ప్రాంతానికి చెందిన వి.వెంకట శివ రామ రాజు అనే విద్యార్ధికి ఆదర్శ యువ విధాయక్ అవార్డు అందుకొన్నారు.
ఆదర్శ ముఖ్యమంత్రి అవార్డుని స్వీకరించడానికి పూణే వెళ్ళిన చంద్రబాబు నాయుడు ఆ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్ధులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నేటి రాజకీయాలలో యువతరం ప్రవేశించవలసిన అవసరం చాలా ఉంది. రాజకీయాలు కలుషితమయిపోయాయని ద్వేషిస్తూ యువత వాటికి దూరంగా ఉన్నంత కాలం రాజకీయ ప్రక్షాళన జరగదు. కనుక ఉన్నత విద్యావంతులయిన యువత రాజకీయాలలో ప్రవేశించినపుడే రాజకీయాలలో సకారాత్మకమయిన మార్పు వస్తుంది. యువత రాజకీయాలలో ప్రవేశిస్తే అవినీతిని సమర్ధంగా అరికట్టవచ్చును. కనుక రాజకీయాలలోకి రావాలనుకొనే విద్యార్ధుల కోసం మీరు నిర్వహిస్తున్న ఈ శిక్షణా కార్యక్రమాల వలన దేశానికి ఎంతో ప్రయోజనం చేకూర్చుతుందని నేను నమ్ముతున్నాను,” అని చెప్పారు.