ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి విజయవాడలో మీడియాతో మాట్లాడారు. “ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ నాకు ఫోన్ చేశారు. హామీలకి కట్టుబడి ఉన్నామని, త్వరలో వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. అదే విషయం పార్లమెంటులో ప్రకటించమని నేను కోరాను. నేను ఇక డిల్లీ వెళ్లనని, ప్రధాని నరేంద్ర మోడీని కలవదలచుకోలేదని మీడియాలో ఒక వర్గం పనిగట్టుకొని నాపై దుష్ప్రచారం చేస్తోంది. నేను అలాగ అన్నానా? నేను ఎన్నిసార్లు కలిసినా ప్రధాని నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో మా ఎంపిలు ప్రధాని మోడీని కలిసి సమస్యల గురించి వివరిస్తారు. ఆయన స్పందన బట్టే తదుపరి కార్యాచారణ ఉంటుందని మాత్రమే చెప్పాను. ఈ రెండేళ్లలో 23సార్లు డిల్లీ వెళ్లాను. అవసరమైతే మళ్ళీ వెళతాను. నాకేమీ భేషజాలు లేవు. రాష్ట్రం కోసం ఎంతయినా కష్టపడతాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబందాలు అరిటాకు-ముల్లు వంటివి. ఏది జరిగినా మనకే నష్టం జరుగుతుంది. కనుక కేంద్రంతో చాలా ఓపికగా, జాగ్రత్తగా వ్యవహరించాలి. కేంద్రం నన్ను కాదు..రాష్ట్రాన్ని, ప్రజలని సంతృప్తి పరచాలి,” అని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మూడునాలుగు రోజులలో మాట్లాడిన మాటలలోనే ఇంత తేడా ఉండబట్టే ప్రతిపక్ష పార్టీలు వాటికి ఈ విషయంలో ఏమాత్రం చిత్తశుద్ధి లేకపోయినా ఆయనని వేలెత్తి చూపగలుగుతున్నాయి. బహుశః ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఆయనతో మాట్లాడినప్పుడు, తెదేపా ఎంపిల వైఖరిపై, అలాగే ముఖ్యమంత్రి స్వయంగా కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేసి ఉండవచ్చు. బహుశః అందుకే ముఖ్యమంత్రి హటాత్తుగా వెనక్కి తగ్గి ఈవిధంగా మాట్లాడుతున్నారేమో? ప్రత్యేక హోదాపై రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉద్యమాలు చేయడం మొదలుపెట్టగానే కేంద్రంపై విరుచుకుపడటం, మళ్ళీ అంతలోనే కేంద్రంతో సఖ్యతగా ఉండవలసిన అవసరం ఉందని చెప్పడం వలన ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు కూడా చివరికి ముఖ్యమంత్రినే తప్పుపడతారు. కేంద్రం పట్ల నిర్దిష్టమైన వైఖరి లేకుండా మాట్లాడటం వలన పార్లమెంటులో ఆందోళన చేస్తున్న తెదేపా ఎంపిలు కూడా అయోమయంలో పడతారు. వారి పోరాటం వృధా అయిపోతుంది.
ముఖ్యమంత్రి కేంద్రంతో కటువుగా మాట్లాడి, తెదేపా ఎంపిల చేత కూడా పార్లమెంటు లోపలా బయటా ఆందోళన చేయిస్తున్నందునే కేంద్రంలో కదలిక వచ్చి, రాష్ట్రానికి ‘ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి’ ఇవ్వడానికి సిద్దం అవుతోంది కనుక రాష్ట్ర ప్రజలు కూడా చాలా సంతోషిస్తున్నారు. ముఖ్యమంత్రి కేంద్రంతో ఆవిధంగా కటువుగా వ్యవహరించడం అవసరమే…అప్పుడే ఫలితం కనిపిస్తుందని ప్రజలు కూడా భావిస్తున్నారు. ఇటువంటి సమయంలో ముఖ్యమంత్రి వెనక్కి తగ్గితే ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుంది. ప్రతిపక్ష పార్టీలకి మరో ఆయుధం అందించినట్లవుతుంది. కేంద్రం చులకనగా చూడవచ్చు. కనుక కేంద్రం పట్ల కటినంగా వ్యవహరించడమే మంచిదే. కేంద్రం ఒక మెట్టు దిగితే ఆయన కూడా దిగవచ్చు అప్పుడు ఎవరూ ఆయనని తప్పు పట్టరు.