ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రష్యా పర్యటన ముగించుకొని వచ్చిన తరువాత తన విదేశీ పర్యటనలపై, రాజధాని నిర్మాణం గురించి తను చేస్తున్న ప్రయత్నాలపై వస్తున్న విమర్శలకి చాలా ఘాటుగా సమాధానం చెప్పారు.
ఆయన విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “హైదరాబాద్ కి బ్రాండ్ ఇమేజ్ సృష్టించినట్లుగానే అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో అమరావతిని నిర్మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక బ్రాండ్ ఇమేజ్ సృష్టించాలని నేను ప్రయత్నిస్తుంటే, నేను విదేశాలలో తిరుగుతున్నానని, రాజధాని నిర్మాణం గురించి నాకు అవగాహన లేదని కొందరు నన్ను విమర్శిస్తున్నారు. ఒక మురికివాడని నిర్మించాలనుకొంటే నేను ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. నా చేతిలో డబ్బులేకపోవచ్చు కానీ అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో అమరావతిని నిర్మించాలనే ఉక్కు సంకల్పం ఉంది. దాని కోసమే నేను విదేశీ పర్యటనలు చేస్తున్నాను.”
“హైటెక్ సిటీ, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించే ముందు విదేశాలలో అటువంటి నిర్మాణాలు ఏవిధంగా ఉన్నాయో అధ్యయనం చేసి, అనేకమార్లు వాటి డ్రాయింగులలో మార్పులు చేర్పులు చేసిన తరువాతే నిర్మించాము. అందుకే అవి నేడు హైదరాబాద్ పేరు ప్రతిష్టలని ఇనుమడింపజేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా చిరస్థాయిగా నిలిచిపోగల ఒక గొప్ప అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మించాలనే తపనతోనే నేను ఇంత కష్టపడుతున్నాను. విమర్శలని భరిస్తున్నాను.”
“విదేశాలు పర్యటించేముందు మన దేశంలోనే నిపుణుల చేతే అమరావతికి డ్రాయింగులు తయారుచేయించాను. కానీ అవేవీ నాకు సంతృప్తి కలిగించలేదు. అందుకే విదేశాల సహాయ సహకారాలు కోరుతున్నాను. ప్రధాని నరేంద్ర మోడీ సూచన మేరకే నేను రష్యాలో అస్తానా నగరాన్ని సందర్శించాను. వాళ్ళు కూడా నదీ తీరాన్న దేశం నడిబోడ్డులో తమ రాజధానిని నిర్మించుకొన్నారు. ఆ కారణంగానే ఆ దేశంలో పెట్టుబడులు పెరిగి శరవేగంగా ఆర్ధికాభివృద్ధి సాధించింది. అమరావతి నిర్మాణంలో సహకరిస్తామని కజికిస్తాన్ ప్రభుత్వం హామీ ఇచ్చింది,” అని చెప్పారు. కజకిస్తాన్, రష్యా దేశాల ప్రధానులు, పారిశ్రామికవేత్తలతో తన సమావేశాల గురించి, ఎంపిక చేసిన కొన్ని రంగాలలో వారి సహకారంతో రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన గురించి చర్చించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో అమరావతిని నిర్మించాలనే ఆయన అభిప్రాయాన్ని ఎవరూ తప్పు పట్టడం లేదు కానీ స్వదేశీ కంపెనీలు, నిపుణులకి ఆ పని చేతకాదని ముఖ్యమంత్రి చెప్పడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. మనవాళ్ళు కేవలం మురికివాడలు మాత్రమే నిర్మించగలరని ముఖ్యమంత్రి చెప్పడం ఇంకా బాధ కలిగిస్తుంది.
మన దేశంలోని ఎన్నో నిర్మాణ సంస్థలు, నిపుణులు విదేశాలకి సేవలు అందిస్తుంటే, వాళ్ళు మనకి పనికిరారని ముఖ్యమంత్రి చెప్పడం చాలా శోచనీయం. మన ప్రస్తుత, భవిష్య అవసరాలకి, ఆర్ధిక స్తోమతుకి తగ్గట్లుగా అమరావతిని నిర్మించుకోవాలని ఆలోచించడం మంచిది. కానీ అంతర్జాతీయస్థాయి ప్రమాణాలున్న నగరం కోసం మన విలువైన భూమిని విదేశీ సంస్థలకి ధారాదత్తం చేసి, రాష్ట్ర ప్రజల భవిష్యత్ ని పణంగా పెట్టవలసిన అవసరం ఉందా? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
విదేశీ కంపెనీలతో, ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకొంటే, మున్ముందు ఏ చిన్న సమస్య వచ్చినా దానిని మన న్యాయస్థానాల పరిధిలో పరిష్కరించుకొనే అవకాశం ఉండకపోవచ్చు. మన న్యాయస్థానాల తీర్పులకి విదేశీ కంపెనీలు కట్టుబడి ఉంటాయనే నమ్మకం లేదు. అదే దేశీయ నిర్మాణ సంస్థలయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పు చేతలలోనే ఉంటాయి. తేడా వచ్చినా మార్పులు చేర్పులు చేసుకోవడం, వాటిని అదుపు చేయడం, అవసరమైతే న్యాయస్థానాల ద్వారా వాటిపై చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. అన్నిటికంటే ప్రధానంగా మన రాష్ట్ర ప్రయోజనాలకి భంగం కలగకుండా నివారించడానికి ఎల్లప్పుడూ అవకాశం ఉంటుంది.
దేశంలో నవీ ముంబై, నయా రాయపూర్ వంటినగరాలు ఈ మద్యకాలంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కొత్తగా నిర్మించబడినవే. అమరావతిని కూడా ఆవిధంగానే దేశీయ సంస్థల చేత నిర్మించుకొని ఉంటే ఎవరూ ఆక్షేపించేవారు కాదు కదా? సింగపూర్ సంస్థలు గీసిచ్చిన మాష్టర్ ప్లాన్ చేతిలో ఉన్నప్పుడు, ఆ ప్రకారమే దేశీయ సంస్థల చేత అమరావతి నిర్మించుకోవడానికి ఇబ్బంది ఏమిటి? నిధుల కొరత అయితే దాని కోసం కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి చేయవచ్చు లేదా దేశీయంగా వివిధ మార్గాల ద్వారా నిధులు సమీకరించుకోవచ్చు అదీ సాధ్యం కాదనుకొంటే దశలవారిగా రాజధానిని నిర్మించుకోవచ్చు కదా? అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.