ఈ నెల 11న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రాపై కేంద్రం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా 12 గంటలపాటు ధర్నా చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇతర పార్టీల నుంచి కూడా మద్దతు పెరుగుతోంది. పలు జాతీయ పార్టీలు చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు ముందుకొస్తున్నాయి. లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి కూడా మద్దతు లభించింది. ఢిల్లీలోని దీక్షా వేదికకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చే అవకాశం ఉందనీ, లేదంటే ఆ పార్టీకి చెందిన ప్రతినిధులు వస్తారని తెలుస్తోంది. ఏపీ సీఎం దీక్షకు పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడు నుంచి డీఎంకే మద్దతు ప్రకటించాయి. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా కూడా దీక్షకు సంఘీభావం తెలపనున్నారు.
మొత్తంగా, దాదాపు 22 పార్టీలు చంద్రబాబు దీక్షకు మద్దతు ప్రకటిస్తాయని తెలుస్తోంది. ఇక, ఈ దీక్షకు ఏపీ నుంచి కూడా భారీ సంఖ్యలో నాయకులు, మద్దతుదారులు ఢిల్లీకి తరలి వెళ్తున్న సంగతి తెలిసిందే. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఏపీ ప్రయోజనాలు ప్రధానాంశంగా మారే అవకాశం ఉంది. భాజపాయేతర పక్షాలన్నీ ఒక కూటమిగా మరింత బలపడేందుకు కావాల్సిన మరో వేదికగా ఢిల్లీలో చంద్రబాబు దీక్ష నిలుస్తుంది. దీంతోపాటు, భాజపాయేతర కూటమి ఎన్నికల అజెండాలో ఏపీ విభజన చట్టం అమలు, ప్రత్యేక హోదా సాధన అనేవి ముఖ్యాంశాలుగా ఉంటాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. మోడీ పాలనలో ప్రధాన వైఫల్యంగా ఆంధ్రపై అనుసరించిన నిర్లక్ష్యం ఇప్పుడు జాతీయ స్థాయిలో మరింతగా ఫోకస్ లోకి రానుంది.
ఇప్పుడు ఢిల్లీలో చంద్రబాబు దీక్ష ఎందుకు, ఎన్నికల ముందు ఇదీ ఒక నాటకమే, దీని వల్ల ఏం ప్రయోజనం ఉండదంటూ వైకాపా నేతలు ఈ మధ్య విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ స్థాయిలో ఏపీ ప్రయోజనాలను ఎన్నికల ఎజెండాలో ఒక ముఖ్యాంశంగా తాజా దీక్ష మార్చనుంది. 22 పార్టీలు మద్దతుగా నిలుస్తూ, మోడీ సర్కారు ఏపీకి అన్యాయం చేసిందంటూ నినదిస్తుంటే… ఈ పోరాటం ప్రభావం ఎలా ఉంటుందనేది ఎవరికైనా ఇట్టే అర్థమౌతుంది. ఇప్పటికిప్పుడు, ఈ పోరాటానికి మోడీ స్పందించరని అందరికీ తెలిసిందే. అయితే, ఎన్నికల తరువాత జాతీయ స్థాయిలో ఏర్పడ్డ ప్రభుత్వం… ముందుగా ఏపీ సమస్యల గురించి పట్టించుకోవాల్సిన ఒత్తిడిని, ఇప్పట్నుంచే తయారు చేసి పెట్టడంలో ఈ దీక్ష విజయం సాధిస్తుందని చెప్పొచ్చు.