ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం డిల్లీకి వెళతారు. సుప్రీం కోర్టు మరియు దేశంలో వివిధ రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడి ఆదివారం ఒక విందు సమావేశం ఏర్పాటు చేశారు. దానిలో పాల్గొనడానికి చంద్రబాబు డిల్లీ వెళుతున్నారు. మళ్ళీ రేపు సాయంత్రం విజయవాడకి తిరిగి వచ్చేస్తారు.
సాధారణంగా చంద్రబాబు డిల్లీ వెళుతున్నారంటే హామీల అమలు గురించి మాట్లాడటానికని, జగన్మోహన్ రెడ్డయితే చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై పిర్యాదు చేయడానికని భావించడం సహజమయిపోయింది. ఈ నమ్మకానికి పూర్తి భిన్నమయిన వాదన కూడా మరొకటి వినబడుతుంటుంది. చంద్రబాబు డిల్లీ వెళితే ఓటుకి నోటు కేసు మాఫీ చేయించుకోవడానికి వెళ్ళారని వైకాపా వాదిస్తే, సిబీఐ కేసులు మాఫీ చేయించుకోవడానికే జగన్ వెళ్ళారని తెదేపా వాదిస్తుంటుంది.
చంద్రబాబు ఇవ్వాళ్ళ డిల్లీ వెళుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఈనెల 25న వెళుతున్నారు. కనుక మళ్ళీ ఈ మాటలన్నీ మళ్ళీ వినబడవచ్చు. అయితే ఈసారి చంద్రబాబు పర్యటనకి చాలా ప్రాధాన్యత ఉందనడానికి బలమయిన కారణాలు కనిపిస్తున్నాయి.
తెదేపాతో భాజపా తెగతెంపులు చేసుకొనేందుకు సిద్దం అవుతోందనే వార్తలు ఇటీవల కొంచెం గట్టిగా వినిపిస్తున్నందున, చంద్రబాబు స్వరంలో కూడా మార్పు కనిపిస్తోంది. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను సాధించుకొనే వరకు కేంద్రాన్ని విడిచిపెట్టనని అన్నారు. అది కేంద్రానికి హెచ్చరికగానే భావించవచ్చు. రాష్ట్రంలో తెదేపా-భాజపాల మధ్య స్నేహం కొనసాగించాలా లేదా అనే విషయం కేంద్రమే నిర్ణయించుకోవలసి ఉంది. ఆ విషయంలో కేంద్రం ఇంకా డైలామాలో ఉంది కనుకనే రాష్ట్రానికి పార్టీ కొత్త అధ్యక్షుడిని ఇంతవరకు నియమించలేకపోయింది. ఇవ్వాళ్ళ చంద్రబాబు నాయుడు డిల్లీ వెళ్లి ప్రధానిని కలిసిన తరువాత దానిపై స్పష్టత రావచ్చు. ప్రస్తుత పరిస్థితులలో తెదేపాతో తెగతెంపులు చేసుకోవడం భాజపాకి రాజకీయంగా ఆత్మహత్య చేసుకొన్నట్లే అవుతుంది కనుక చంద్రబాబుకి ఆమోద యోగ్యుడయిన వ్యక్తినే రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా నియమించవచ్చు. అంటే కంబంపాటి హరిబాబునే కొనసాగించే అవకాశం ఉందని భావించవచ్చు.