ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిన్న వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణపనుల పురోగతిని సమీక్షించిన తరువాత హైకోర్టు విభజనపై ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణా ప్రభుత్వం వారి సమస్యల గురించే మాట్లాడుతోంది తప్ప విభజన సమస్యల గురించి మాట్లాడటం లేదు. హైకోర్టు విభజన ఒకటే కాకుండా ఇంకా అనేక సమస్యలు నేటికీ అపరిష్క్రుతంగా ఉండిపోయాయి. వాటి గురించి మాట్లాడటం లేదు. రెండు రాష్ట్రాల మద్య ఉన్న సమస్యలని చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి నేను సిద్దంగా ఉన్నానని మొదటి నుంచి చెపుతూనే ఉన్నాను. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకొంటూ అభివృద్ధి సాధించాలి,” అని అన్నారు.
హైకోర్టు విభజన గురించి గట్టిగా మాట్లాడుతున్న తెలంగాణా ప్రభుత్వం షెడ్యూల్:9,10ల క్రింద ఉన్న సంస్థల పంపకాల గురించి మాట్లాడటం లేదు. వాటి గురించి అసలు మాట్లడవలసిందేమీ లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. రాజోలి బండ ప్రాజెక్టు విషయంలో తనకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తనంతటతానే చర్చలకి సిద్దమయింది. అదేవిధంగా హైకోర్టు విభజనకి తెలంగాణా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది కనుక దానిని హైలైట్ చేస్తూ దాని గురించి గట్టిగా మాట్లాడుతోంది. మళ్ళీ మిగిలిన విషయాలలో తెలంగాణా ప్రభుత్వం ఆవిధంగా చొరవ చూపదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెపుతున్న ఇతర సమస్యల గురించి తెలంగాణా ప్రభుత్వం కనీసం ఆలోచించడానికి కూడా ఇష్టపడదు కానీ తన సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించాలని కోరుకొంటుంది. తన సమస్యలే చాలా ముఖ్యమన్నట్లు మాట్లాడుతూ, వ్యవహరిస్తోంది తప్ప ఇతర సమస్యలని పట్టించు కోవడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాట వాస్తవమే.